
తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.
బ౦గాళాఖాత౦లో ఏర్పడిన మరో అల్పపీడన౦ మరింత బలపడి తీవ్ర అల్పపీడన౦గా మారే అవకాశమందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర బ౦గాళాఖాత౦తో పాటు దాని పరిసర ప్రాంతాలలో కేంధ్రీకృతమైందని, తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటు, రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందన్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు గా వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఉతర కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. అటు, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.