Rachakonda cp reveals crime report: ఈ ఏడాది హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలీస్తే నేరాలు 12 శాతం తగ్గాయి అయితే అదే సమయంలో మహిళలపై వేధింపులు 11 శాతం పెరగడం గమనార్హం. 2020 ముగుస్తోన్న సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ వార్షిక నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. దోపిడీలు, దొంగతనాల కేసుల్లో 53 శాతం రికవరీ జరిగినట్లు తెలిపారు. రాచకొండలో మొత్తం 52 హత్యా, 323 అత్యాచార, 137 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని కమిషనర్ వివరించారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11,892 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డయల్ 100కు రోజూ 1,66,181కు తక్కువ కాకుండా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇక స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెందిన కేసులు 892 ఉండగా రూ.5 కోట్ల 95 లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు. మొత్తం 2,525 మిస్సింగ్ కేసులు నమోదవగా.. 2233 కేసులు ఛేదించామని తెలిపారు. ఈఏడాది 89 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామన్నారు. ఇదిలా ఉంటే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘సైబర్ యోధా’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారి ఈ కార్యక్రమాన్ని మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాచకొండ వార్షిక క్రైమ్ రివ్యూలో భాగంగా పై వివరాలు వెల్లడించారు.