బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వారం మేరకే ఢిల్లీకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. గంటపాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి, అమరావతి, పోలవరం ప్రాజెక్టు అంశాలపై చర్చించామని పవన్ తెలిపారు. నడ్డాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తిరుపతి ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిని నిలబెట్టి అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇక బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఏపీలో అధికారంలోకి ఎలా రావాలన్న అంశంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకు బీజేపీ-జనసేన అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతిభద్రతల సమస్య, దేవాలయాలపై దాడుల గురించి చర్చించామన్నారు. అలాగే ఈ అంశాలపై కమిటీ వేసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా సమాలోచనలు జరిపామన్నారు.