ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ‘ఆపరేషన్ సుర’ కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. పదివేల మంది సిబ్బందితో ఆపరేషన్ కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు, ఎక్చైజ్‌శాఖ సమన్వయంతో దాడులు చేశారు. నాటుసారా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లాలో పలు చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. తోటనండూరు మండలంలో రెండున్నర వేల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జగ్గంపేట, కొత్తూరు, తిమ్మాపురాలలో నిల్వ ఉంచిన బెల్లం ఊట, నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా మెరుపుదాడులు కొనసాగుతున్నాయి.
చీరాల సిటీలో నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. వి చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో నాటుసారా విక్రేతలపై ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు దాడులు చేశారు. బంటుమిల్లి మండలంలోని రామవరపుమోడి గ్రామంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి..అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అర్తమూరు మల్లాయి చెరువు వద్ద పోలీసులు.. 200 లీటర్ల బెల్లంఊట, 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో 500 లీటర్ల బెల్లం ఊట, చినగొల్లపాలెంలో 200 లీటర్ల బెల్లం ఊట, పోడు గ్రామంలో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి.