ఆగష్టు వరకు నో క్రికెట్: గంగూలీ

|

Jun 30, 2020 | 1:36 PM

ప్రస్తుత పరిస్థితులు క్రికెట్‌కు అనుకూలంగా లేవని.. ఆగష్టు వరకు ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని గంగూలీ వెల్లడించాడు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి విదితమే.

ఆగష్టు వరకు నో క్రికెట్: గంగూలీ
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దశలవారీగా అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో రోజురోజుకూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే భారత క్రికెటర్లు ఈ మహమ్మారి కారణంగా మూడు నెలల నుంచి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కొందరు క్రికెటర్లు రాష్ట్ర సంఘాల మైదానాల్లో వ్యక్తిగతంగా సాధన చేయడం మొదలుపెట్టారు. అయితే మున్ముందు జరగాల్సిన సిరీస్‌లు మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితులు లేవని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితులు క్రికెట్‌కు అనుకూలంగా లేవని.. ఆగష్టు వరకు ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని గంగూలీ వెల్లడించాడు.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి విదితమే. అయితే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు బీసీసీఐ అనుమతులు ఇచ్చినా.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే మ్యాచులు నిర్వహించాలని అనుకుంటోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆటగాళ్లు సన్నద్ధం కావాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల ప్రాక్టీస్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అయితే కరోనా కారణంగా ఆగష్టు వరకు జాతీయ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ విండోలో ఐపీఎల్ సీజన్ 13ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ తమ నిర్ణయాన్ని వెల్లడిస్తే.. ఐపీఎల్ నిర్వహణపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: అన్‌లాక్ 2.0: ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దు..!