నివర్ తుపాను బీభత్సంతో తమిళనాడు, పుదుచ్ఛేరి తీవ్ర పరిస్థితిని ఎదుర్కోనున్నాయి. దక్షిణ బంగాళాఖాతానికి చెన్నైకి వాయువ్య దిశగా కేంద్రీకృతమై ఉన్న ఈ విలయం వల్ల గంటకు 120 నుంచి 135 మైళ్ళ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్ఛరించింది. చెన్నైలో అప్పుడే పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారవచ్చునని అధికారులు భావిస్తున్నారు. 13 జిల్లాల్లో బుధవారం ప్రభుత్వ సెలవుదినంగా పాటించాలని తమిళనాడు సీఎం పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాకూడదని సూచించారు. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని కోరారు. ఇక నష్టం అంచనా, సర్వేలెన్స్, సహాయ చర్యల కోసం విశాఖపట్నంలో మూడు డోర్నియర్ విమానాలను సిధ్ధంగా ఉంచారు. 15 కు పైగా డిజాస్టర్ టీమ్ రిలీఫ్ బృందాలు కూడా రెడీగా ఉన్నాయి.
పుదుచ్ఛేరి లోనూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పల్లపు ప్రాంతాలవారిని సురక్షిత శిబిరాలకు తరలించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.