Navaratnalu – Pedalandariki Illu : ఆంధ్రప్రదేశ్‌లో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం డిసెంబర్ 25న ప్రారంభం కానుంది. పట్టాల పంపిణీకి అంతా సిద్ధమైంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయ్యింది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 25న కాకినాడ, 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరంలో సీఎం జగన్ స్వయంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు.
మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అందించనున్నారు. పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నారు. ఇక పేదలందరికీ ఇళ్లు పథకంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం 935 కోట్ల విడుదలకు రెవెన్యూశాఖకు అనుమతి ఇచ్చింది.
సీసీఎల్‌ఏ ద్వారా భూ సేకరణకు చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. లబ్దిదారులు ఎలా కట్టించి ఇమ్మంటే ఇలా ఇవ్వాలని సూచించారు.
అటు సీఎం జగన్ ఈ నెల 24న పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. స్థానికంగా అపాచీ కంపెనీ, ఆర్టీసీ కాంప్లెక్సులకు శంకుస్థాపన చేయనున్నారు. 25న కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నేరుగా కాకినాడుకు చేరుకొని పట్టాల పండుగలో పాల్గొంటారు. లబ్దిదారులకు పట్టాలను అందజేయనున్నారు.