దగ్గరుండి మరీ కూల్చి వేయించిన ఎమ్మెల్యే..

|

Sep 17, 2020 | 1:32 PM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన క్యాంప్‌ కార్యాలయాన్ని దగ్గరుండి మరీ కూల్చి వేయించారు. నాలాను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనెవరో కాదు ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌. నాలా విస్తరణ నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయ భవనం తొలగింపునకు..

దగ్గరుండి మరీ కూల్చి వేయించిన ఎమ్మెల్యే..
Follow us on

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన క్యాంప్‌ కార్యాలయాన్ని దగ్గరుండి మరీ కూల్చి వేయించారు. నాలాను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనెవరో కాదు ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌. నాలా విస్తరణ నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయ భవనం తొలగింపునకు ఆయనే స్వయంగా ముందుకొచ్చారు. ఎమ్మెల్యే సూచన మేరకు హంటర్‌ రోడ్‌లోని ఆరూరి రమేష్‌ వ్యక్తిగత క్యాంపు కార్యాలయాన్ని బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కూల్చి వేశారు.

భారీ వరదలు, నాలాల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వరంగల్‌లో ఎక్కడికక్కడ నీరు పేరుకుపోయింది. ఏకంగా నగరంలో రహదారులు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. తాజాగా వరంగల్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి కేటీఆర్‌ అక్కడ పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆయన నాలా స్థలాలు, బఫర్‌ జోన్‌లు ఆక్రమించి చేసిన నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు వరంగల్‌లో 470కి పైగా ఉన్నాయి. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ వ్యక్తిగత క్యాంపు కార్యాలయం కూడా ఉంది. నాలా స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేశారని విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దగ్గరుండి ఆ నిర్మాణాన్ని కూల్చి వేయించారు.

వరంగల్‌ నగరంలో జరుగుతున్న నాలాల విస్తరణ పనులు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అంతా అధికారులకు సహకరించాలని కోరారు.