
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ మరోసారి డీజిల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు యోచిస్తోంది. ఎస్ యూవీ, మల్టీపర్సప్ కేటగిరిల్లో డీజిల్ వాహనాలకు గిరాకీ ఉండటంతో కంపెనీ మళ్లీ పునరాలోచనలో పడినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి బీఎస్ -6 వాహనాలను తప్పనిసరి చేయడంతో డీజిల్ సెగ్మెంట్ నుంచి మారుతీ తప్పుకొన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే మానేసర్లోని తయారీ కేంద్రాన్ని బీఎస్-6 డీజిల్ ఇంజన్ల తయారీకి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా వర్గాలు తెలిపాయి. వచ్చే సంవత్సరం పండగ సీజన్ నాటికి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎర్టిగా, విటారా బ్రెజా మోడళ్లతో డీజిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నట్లు సమాచారం.1500 సీసీ సామర్థం గల డీజిల్ ఇంజన్ను తయారు చేసేలా ప్లాంట్ ను నెలకొల్పుతున్నట్లు తెలుస్తోంది