సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తమ్ముడి ఆస్తి మీద కన్నేసి అన్న.. అతన్ని అతి దారుణంగా హతమార్చాడు. ఇందుకు తన స్నేహితులతో కలసి ప్లాన్ ప్రకారం అతనిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అన్నతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని మల్లంపేట్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అయిన వెంకటేష్ కు నలుగురు అన్నదమ్ములు. అందులో ఇద్దరు చనిపోగా, ఇంటికి సంబంధించిన ఆస్తులను ఎవరికి వారు పంచుకున్నారు. కాగా, తనకు రావలసిన 90 గజాల స్థలం లో తన పెద్దన్న యాదగిరి 30 గజాలు ఆక్రమించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరి మరొకరు దాడి కూడా చేసుకున్నారు.
అయితే, తమ్ముడు వెంకటేష్ ను ఎలాగైనా హత్య చేయాలని ఫ్లాన్ చేసిన యాదగిరి, తన స్నేహితులతో కలిసి లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత నెల 11వ తేదీన ఆటో నడుపుతున్న వెంకటేష్ ఆటో స్టాండ్ కి వెళ్లి, పలుగు పోచమ్మ కు వెళ్దామని కిరాయి కుదుర్చుకున్నారు నిందితులు. యాదగిరి ఇచ్చిన పైసలతో మద్యం తాగి తిరిగి వస్తూ.. మార్గమధ్యలో కిష్టయపల్లి శివారు ప్రాంతాని కి రాగానే , ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం తమ వద్ద ఉన్న కత్తులతో విచక్షణారహితంగా వెంకటేష్ ను అతి కిరాతకంగా పొడిచి చంపారు.
స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు జరిపిన విచారణలో అన్న యాదగిరిని ప్రధాన నిందితుడిగా తేల్చారు. యాదగిరితో సహా రాజేష్ , జగదీశ్ , సాయి కిరణ్ , షేక్ ఫరీద్, నవీన్ లను అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న నగదు, కత్తుల ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించిన్నట్లు పోలీసులు తెలిపారు.