
తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి టెంపరేచర్లు 6 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చలిగాలులతోపాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు.
మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే… ఖమ్మంలో గరిష్టంగా 32.6 డిగ్రీ సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో కనిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ నమోద య్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు వాతా వరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక నగరవాసులను చలి మరింత వణికిస్తోంది. ఒక్క రోజులో 2డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం రాత్రి 15.5 డి గ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బుధవారం అవి 13.8కి పడిపోయాయి. ఉదయం 9 గంటల వరకూ చలిగాలులు వదలడం లేదు. ప్రధాన రహదారులు సైతం తెల్లవారుజామున నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.