
శ్రీలంకలో విచిత్రం చోటుచేసుకుంది. దేశమంతా సోమవారం అంధకారంలో చిక్కుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన విద్యుత్కేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా లేదు. సూర్యాస్తమయం తర్వాత కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. అత్యధిక ప్రాంతాలు చీకట్లోనే ఉన్నాయి. రోడ్లపై వాహనదారులు, పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. విద్యుత్తు శాఖ మంత్రి డుల్లాస్ అలమప్పెరుమ మాట్లాడుతూ, కెరవలపిటియ పవర్ స్టేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పారు. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కేరవలాపిటియా గ్రిడ్ సబ్ స్టేషన్ వద్ద ప్రసార వైఫల్యం కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని సిలోన్ విద్యుత్ బోర్డు (సిఇబి) తెలిపింది. ఇది చమురు ఆధారిత థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం. శ్రీలంక విద్యుత్తు డిమాండ్‌లో 12 శాతం ఈ విద్యుత్కేంద్రం నుంచి సరఫరా అవుతోంది. దాదాపు 6 గంటల తర్వాత కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించగలిగారు. కానీ అత్యధిక ప్రాంతాలు చీకట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కొలంబో నగర ప్రజలు విద్యుత్తు లేకపోవడంతో అనేక కష్టాలు పడ్డారు.