జాతీయ రహదారికి 500 కోట్లు.. కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్ మహానగరానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ - విజయవాడ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగించి... జాతీయ రహదారిని అభివ‌ృద్ధి పరిచేందుకు నిధులు...

  • Rajesh Sharma
  • Publish Date - 3:52 pm, Thu, 1 October 20
జాతీయ రహదారికి 500 కోట్లు.. కేటీఆర్ డిమాండ్

KTR demanded Rs.500 Cr for Hyderabad-Vijayawada national high way: హైదరాబాద్ మహానగరానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించాలని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కే. తారక రామారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.

జాతీయ రహదారి నెంబర్ 65 హైదరాబాద్ నగరం పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేరకు విస్తరించి వుంది. పుణె-మచిలీపట్నం పట్టణాలను కలిపే ఈ జాతీయ రహదారి నగరంలో అత్యంత కీలకమైన రూట్ల గుండా సాగుతుంది. హైదరాబాద్ నగరం పరిధిలో అత్యంత రద్దీ ప్రాంతాల గుండా సాగే ఈ హైవేకు ప్రత్యేకంగా లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలు లేవని, లైన్ కెపాసిటీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఇటీవల జరిగిన సమావేశంలో పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 500 కోట్ల రూపాయలు ఖర్చుకాగల డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నందున.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని విస్తరించాల్సిన అవసరాన్ని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. రోడ్ల విస్తరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గడ్కరీ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నగరానికి 4 అర్బన్ ప్రాజెక్టులు వచ్చాయని, అందులో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు.

Also read: పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ

Also read:  హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ