కర్ణాటకలో రెండు రోజులుగా సాగుతున్న పొలిటికల్ హై డ్రామాలో ఒకదానివెనుక ఒకటి ట్విస్టులు సస్పెన్స్ ని పెంచుతున్నాయి. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడిపోయే అంచుకు చేర్చిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ-ఎస్ సభ్యులు ఇప్పటికీ తాము ‘ పవిత్రులమని ‘, ప్రభుత్వాన్ని సుస్థిరత్వంగా ఉంచేందుకు ‘ కృషి ‘ చేస్తున్నామని పదేపదే చెబుతున్నారు (అంతకుముందే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే). . మరి అలాంటప్పుడు.. కుమారస్వామి విదేశీ టూర్ లో ఉన్నప్పుడు.. ఆయన లేని సమయాన హఠాత్తుగా బెంగుళూరు నుంచి ఓ బీజేపీ ఎంపీ ఆధ్వర్యంలోని ఓ సంస్థ నడుపుతున్న విమానంలో ముంబై ఎందుకు వెళ్ళారన్నది ప్రశ్న.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ చైర్మన్ గా ఉన్న జూపిటర్ కేపిటల్ అనే సంస్థ ఈ జెట్ విమానాన్ని నిర్వహిస్తోంది.
సాధారణంగా ప్రముఖుల రాకపోకలకు ఈ ప్లేన్ ని వినియోగిస్తుంటారట. అంటే ఎవరైనా ఈ విమాన సర్వీసును బుక్ చేసుకోవచ్చు. ఈ రెబల్ ఎమ్మెల్యేలను ఈ ప్లేన్ ద్వారా ముంబైకి చేర్చాలని ఎవరు కోరారు, ఎవరి తరఫున ఈ ఆర్డర్ వచ్చిందన్న విషయాల గురించి చెప్పడానికి ఈ సంస్థ అధికారులు నిరాకరించారు. అదంతా సీక్రెట్ అన్న చందంగా వ్యవహరించారు. పైగా ముంబైలో ఈ సభ్యులంతా ఓ ఫైవ్ స్టార్ హోటల్ చేరుకోగానే వారిని రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు రావడం, అక్కడ మరికొందరు బీజేపీ నేతలతో ఈ రెబల్ సభ్యులంతా మంతనాలాడ్డం పెద్ద ‘ నాటకాన్ని ‘ కళ్ళకు కడుతోంది. సీఎం కుమారస్వామి యుఎస్ నుంచి బెంగుళూరు తిరిగి రాగానే పొలోమంటూ ఎమ్మెల్యేలంతా ఆయనను కలిసి రాష్ట్రంలో పెను రాజకీయ సంక్షోభమేదీ లేనట్టే వ్యవహరించారు. ప్రభుత్వానికి వఛ్చిన ముప్పేమీ లేదని చెబుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య.. మెల్లగా తన వంతు ప్రయత్నాలు తాను ప్రారంభించారు. మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో ఆయన భేటీ అయి.. త్వరలో చేపట్టాల్సిన ‘ కార్యాచరణ ‘ గురించి చర్చించనున్నారు. అటు రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ శివకుమార్.. తాను రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను చించివేసినట్టు తెలిపారు. జేడీ-ఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన ఆయన.రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తన కృషి ఉందంటూనే ..రెబల్ సభ్యుల రాజీనామాల విషయంలో తానేం చేయలేనన్నట్టు వ్యవహరించారు. . మరో వైపు
జేడీ-ఎస్ నేత విశ్వనాథ్…. ఆల్రెడీ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప ..రాష్ట్రంలో తలెత్తిన తాజా సంక్షోభానికి, తమ పార్టీకి ఏమీ సంబంధం లేదని ప్రకటించారు.
అయితే తుంకూరులో అడుగు పెట్టిన ఆయన..తమ పార్టీ కార్యకర్తలను చూసి..ఇక కర్ణాటకలో మనదే అధికారం అన్నట్టు రెండు చేతివేళ్ళు చూపుతూ విక్టరీ సైన్ చూపడం విశేషం. మరికొందరు బీజేపీ నేతలు కూడా తామేమీ ‘ ఇతర పార్టీల ‘ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంలేదని, ప్రభుత్వం దానంతట అదే కూలిపోతే తామేమీ చేయలేమని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఏమైనా.. తెరచాటున కమలనాథులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నది వాస్తవం. అటు-తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నుంచి తమకు మంచి ‘ ఆఫర్ ‘ వస్తుందేమో అన్నట్టు అటు ఆకుకు, ఇటు పోకకు అందకుండా వ్యవహరించడం చూస్తుంటే కుమారస్వామి సర్కార్ పతనం అంచుల్లో ఉన్నట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మరో 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే సర్కార్ కుప్ప కూలడం ఖాయమన్న వార్తలు వినవస్తున్నాయి.