
దీపావళి పర్వదినం సందర్భంగా బాణాసంచాను ఎవరూ కొనకూడదు, కాల్చకూడదు అన్న కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గారు.. బాణాసంచాపై నిషేధం విధించడానికి కారణం కాలుష్యం పెరుగుతుందనే కాబట్టి.. వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్‌ను నిరభ్యంతరంగా కాల్చుకోవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది.. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు యడియూరప్ప. దీపావళి పండుగ రోజున కేవలం గ్రీన్ దీపావళిని మాత్రమే జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా పర్యావరణానికి ఎలాంటి కీడు చేయని టపాసులను మాత్రమే తయారు చేయాలని, వాటినే అమ్మాలని చెప్పారు.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని యడియూరప్ప సూచించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.