బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఈ పార్టీ నేత కపిల్ సిబల్ వ్యంగ్యంగా స్పందించారు. ఇది మామూలేగా అంటూ పెదవి విరిచారు. ఈ ఘోర ఓటమిపై పార్టీ నాయకత్వం నుంచి ఒక్క మాటకూడా లేదన్నారు. పార్టీ పనితీరు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ అగ్ర నాయకులు మాట్లాడకపోవడంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. కనీసం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న యోచన కూడా లేకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. 2014 లోక్ సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పార్టీ పర్ఫామెన్స్ మీద ఎందుకు ఆత్మావలోకనం చేసుకోవడంలేదో తెలియడం లేదు అని కపిల్ సిబల్ అన్నారు. ఇది మామూలే అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా మించిపోయింది లేదని పేర్కొన్నారు. ఇంతకు మించి పార్టీ పై తానేమీ మాట్లాడే పని లేదని ఆయన అన్నారు.