మధ్యప్రదేశ్‌లో పడవ మునిగిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తూ జుగాడ్ పడవ నదిలో బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తు్న్న 10 మంది మునిగిపోయారు. స్థానికులు వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శనివారం ఉదయం సరోలా గ్రామంలో చోటుచేసుకుంది. వివాహానికి హాజరయ్యేందుకు ఆవలి ఒడ్డున ఉన్న శంబుసింహ్ ఇంటికి జుగాడ్ పడవలో బయల్దేరారు. పడవ కొంచెం దూరం చేరుకోగానే కొందరు లేచి నిలబడ్డారు. దాంతో పడవ ఒకవైపునకు ఒరిగి నదిలో మునిగిపోయింది. పడవలోని పది మంది మునిగిపోతుండటం గమనించిన సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరిగెత్తుకు వచ్చి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.క్షతగాత్రులకు ప్రథమ చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చమ్లా నదిలో ఎప్పడు నీటి ప్రవహిస్తుంది. నదికి ఆవలి వైపున ఉన్న గ్రామానికి వెళ్లాలంటే స్థానికంగా తయారుచేసిన పడవలే శరణ్యం. పడవ కాకుండా రోడ్డు మార్గాన వెళ్లాలంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిందే. అందుకే పడవలో వెళ్లేందుకు చాలా మంది మొగ్గు చూపుతారని సర్పంచ్ కిషోర్ గుర్జార్ తెలిపారు.