‘గోవా’… పర్యాటకులకు భూలోక స్వర్గం. అక్కడున్న అనేక బీచ్‌లు జీవితమకరందాన్ని తెలియజెబుతుంటాయి. ఏ బీచ్‌కు వెళ్లినా అద్దాల్లాంటి సముద్ర తీరపు అలలు, ప్రకృతిని చూస్తూ పర్యాటకులు పరవశించిపోతారు. కరోనా ఆంక్షలు కూడా లేకపోవడంతో టూరిస్టులు ఇప్పుడిప్పుడే గోవాలో పెరుగుతున్నారు. అయితే గత రెండు రోజులుగా బీచ్‌లలో జెల్లీ ఫిష్‌లు పర్యాటకుల్ని కరిచి భయపెడుతున్నాయి. దీంతో బీచ్‌లో తిరగాలంటేనే జంకే పరిస్థితి కనిపిస్తోంది. గోవాలోని బాగా-కలాంగుటె బీచ్, కండోలిమ్ సింకెరిమ్ బీచ్, దక్షిణ గోవా బీచ్‌లలో ఈ ఘటనలు వెలుగుచూశాయి.
దీంతో పర్యాటకులకు సహాయం అందించేందుకు బీచ్‌ల దగ్గర లైఫ్ సేవర్స్‌ను ఏర్పాటు చేశారు. వారు జెల్లీ ఫిష్‌లు కుట్టిన బాధితులకు సహాయం అందిస్తున్నారు. వారికి ప్రథమ చికిత్స చేస్తున్నారు. బాగా బీచ్‌లో ఇద్దరికి జెల్లీ ఫిష్ కుట్టగా ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. వందమందికి పైగా జెల్లీ ఫిష్ బాధితులు గోవాలో కనిపిస్తున్నారు.