JEE Advanced 2022 Dates Likely to be Changed: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced) అడ్వాన్స్‌డ్ 2022 వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉంది. ఐతే జేఈఈ మెయిన్ తేదీలను మార్చడంతో.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేదీలలో మార్పులు చేయవల్సి వచ్చిందని ఐఐటీ బాంబే (IIT Bombay) పేర్కొంది. కొత్త తేదీలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని అంచనా. కాగా ప్రతీ ఏట జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వాయిదాకు కారణం ఇదే..
ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్, జులైలో నిర్వహిస్తామంది. జేఈఈ మెయిన్ రెండో విడత జులై 30తో ముగుస్తుంది. మొదటి, రెండో విడతల్లో అర్హత సాధించిన 2.50 లక్షల మందికే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. అంటే జేఈఈ మెయిన్ నిర్వహించిన.. ర్యాంకులు వెల్లడించాకే అడ్వాన్స్‌డ్ పరీక్ష పెట్టాలి. అందువల్ల జులై 3న తలపెట్టిన అడ్వాన్స్‌డ్ పరీక్షను వాయిదా వేయక తప్పలేదు. జులై 30కి జేఈఈ మెయిన్ పూర్తయితే..ఆ తర్వాత 10-15 రోజుల్లో ర్యాంకులిస్తారు. తదుపరి 25-30 రోజుల వ్యవధి ఇచ్చి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. అంటే సెప్టెంబరు మొదటి లేదా రెండో వారంలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొదటి వారమైతే సెప్టెంబరు 4న, రెండో వారమైతే 11న ఉంటుందని సమాచారం. గత ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా అక్టోబరు 3న అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. అంటే ఈసారి దాదాపు ఒక నెల ముందుగా ఉండొచ్చు.
బోర్డు పరీక్షలతో వచ్చిన తంటా..
12వ తరగతి బోర్డు పరీక్షల కారణంగా జేఈఈ మెయిన్ 2022 పరీక్ష తేదీలను మార్చి కొత్త షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఏప్రిల్, మే నెలల్లో ఉంటాయని ప్రకటించడంతో జులై 3న అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తామని ఐఐటీ బాంబే ప్రకటించింది. దీంతో జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షలు జూన్ 20 నుంచి జూన్ 29 వరకు జరగనున్నాయి. ఇక జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 పరీక్షలు జూలై 21 నుంచి జూలై 30 వరకు ఎన్టీఏ నిర్వహించనుంది. ఇవి పూర్తయితేనే అడ్వాన్స్‌డ్ జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం nta. ac.in లేదా jeemain.nta.nic.in వెబ్‌సైట్లను ఇప్పుడు పరీక్ష జూన్-జూలై 2022లో నిర్వహించబడుతోంది.
Also Read: