Interesting Offer By Chinese Shopping Mall: కస్టమర్లను ఆకర్షించడం కోసం.. అంతేకాక వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో భాగంగా కొంతమంది వ్యాపారాలు విచిత్రమైన ఆఫర్లను ప్రకటిస్తుంటారు. కొన్నిసార్లు అవి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే.. మరికొన్ని సార్లు యజమానికే కొత్త చిక్కులు తెచ్చిపెడతాయి. ఇక ఇప్పుడు ఇదే కోవలో చైనాలోని ఓ షాపింగ్ మాల్ యువకుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. ఆ ఆఫర్ వినడానికి కొంచెం విచిత్రంగా కూడా ఉంటుంది.
కేవలం రూ.10కే గర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకు ఇస్తోంది. హ్యూవాన్ సిటీలోని ది విటాలిటీ సిటీ షాపింగ్ మాల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. షాపింగ్‌కు ఒంటరిగా వచ్చే యువకులకు.. అమ్మాయిలను అద్దెకు ఇచ్చేందుకు వారి కోసం మాల్ ప్రత్యేక పోడియంలను నిర్దేశించారు. అయితే వారిని అద్దెకు తీసుకోవడానికి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి.
ఆ అమ్మాయిలు మీతో పాటు వచ్చిన పిల్లలను చూసుకుంటారు.. అంతేకాక షాపింగ్ బ్యాగులను కూడా పట్టుకుంటారు. కానీ వారిని మాత్రం తాకకూడదు, బయటికి తీసుకెళ్లకూడదు. అయితే లంచ్, డేట్‌కు తీసుకెళ్లే సౌకర్యాన్ని మాత్రం మాల్ కల్పిస్తోంది. ఇక అమ్మాయిను అద్దెకు తీసుకోవడానికి.. 20 నిమిషాలకు రూ.10 చెల్లిస్తే చాలు. కాగా, కస్టమర్ల సంఖ్యను పెంచే క్రమంలోనే ఆ షాపింగ్ మాల్ ఇలాంటి వినూత్న ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.