
Hot air balloon Safari: ఇది నిజంగా ప్రకృతి ప్రేమికులకు, టూరిస్టులకు శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటి వరకు బయటి దేశాల్లో మాత్రమే ఎయిర్ బెలూన్ సఫారీ చూసిన మనం.. ఇప్పుడు మన దేశంలోనూ అలా విహరించవచ్చు. అడవిలోని జీవులను ఆకాశం నుంచి వీక్షించొచ్చు. అవును.. ఇది నిజంగా నిజం. దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని బాంధవగఢ్ టైగర్ రిజర్వ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ సఫారీని ప్రవేశపెట్టారు. ‘టైగర్ రిజర్వ్ హాట్ ఎయిర్ బెలూన్ వైల్డ్ లైఫ్ సఫారీ’ పేరుతో ఈ సేవలను అందుబాటులో తీసుకువచ్చారు. దీని ద్వారా పర్యాటకులు హాట్ ఎయిర్ బెలూన్‌లో కూర్చుని అడవి జంతువులను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు బయటి దేశాల్లో మాత్రమే ఇలా వీక్షించే అవకాశం ఉండగా.. ఇప్పుడు మనదేశంలోనూ ఎయిర్ బెలూన్ సఫారీ అందుబాటులో రావడంతో ఇండియన్ టూరిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని మిగతా టైగర్ రిజర్వుల్లోనూ ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా పేర్కొన్నారు.
Also read: