మరో భారతీయుడికి అరుదైన గౌరవం

| Edited By: Pardhasaradhi Peri

Jun 09, 2020 | 7:14 PM

మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని కీలక పదవి వరించింది.

మరో భారతీయుడికి అరుదైన గౌరవం
Follow us on

మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని కీలక పదవి వరించింది. ఆ సంస్థ సెర్చ్‌ హెడ్‌గా దక్షిణ భారతానికి చెందిన ప్రభాకర్‌ రాఘవన్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో బెన్‌గోమ్‌ కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాఘవన్‌ గూగుల్‌ క్లౌడ్‌ సేవలు, గూగుల్‌ యాప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గావ్యవహరిస్తున్నారు. జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌ నెలకు 100 కోట్ల యాక్టివ్‌ యూజర్ల మైలురాయిని అధిగమించడంలో రాఘవన్‌ కీలక పాత్ర పోషించారు. రాఘవన్‌ నూతన బాధ్యతల్లో నేరుగా సీఈవో సుందర్‌ పిచాయ్‌కు అనుబంధంగా పనిచేయనున్నారు.
ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ పూర్తిచేసిన ప్రభాకర్‌ బెర్క్‌లీ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ సాధించారు. 2012లో గూగుల్‌లో చేరిన ఆయన 2018లో గూగుల్‌ అ‍డ్వర్టైజింగ్‌, కామర్స్‌ బిజినెస్‌ హెడ్‌గా ఎదిగారు. సెర్చి డిస్‌ప్లే పర్యవేక్షణ, వీడియా అడ్వర్టైజింగ్‌ అనలిటిక్స్‌, షాపింగ్‌, పేమెంట్స్‌ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. గతంలో ఐబీఎం, యాహూ సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. జీ సూట్‌లో స్మార్ట్‌ రిప్లై, స్మార్ట్‌ కంపోజ్‌, డ్రైవ్‌ క్విక్‌ యాక్సెస్‌లాంటి ఫీచర్లను ఆయన ప్రవేశపెట్టారు. కొత్త బాధ్యతల్లో రాఘవన్‌ ప్రభాకర్‌ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. ప్రపంచ అత్యుత్తమ కంపెనీల నిర్వహణలో భారతీయుల పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది.