జమ్మూకశ్మీర్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. నవంబర్ 13 నాటి కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ఇండియా.. పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్(పీఏఐ) డెస్క్‌లోని భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కూడా పాకిస్తాన్ హైకమిషన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
భారత్‌లో పండుగ వాతావరణం ఉన్నసమయంలో ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. హింసను వ్యాప్తి చేసేలా పాకిస్థాన్ వైపు నుంచి జరుగుతున్న చర్యలను, సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటుకు ఆ దేశం నుంచి అందుతున్న మద్దతును తప్పుబట్టింది. జమ్ము కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు అమరులవ్వగా… మరో ఆరుగురు పౌరులు చనిపోయారు. పాక్ కాల్పులకు భారత సైన్యం ఎదురుకాల్పులతో ధీటుగా కౌంటరిచ్చింది. దీంతో 11 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు.
ఈ క్రమంలో ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను భారత బలగాలు పేల్చేశాయి. ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ను పాక్ స్థావరాలపై ఇండియా సంధించింది. ఆయుధ కేంద్రాలు, బంకర్లు, టెర్రరిస్టులను భారత్‌లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన స్థావరాలను పేల్చేసింది. చనిపోయిన పాక్ సైనికుల్లో స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలు ఇద్దరు ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Also Read :
బిగ్ బాస్ 4 : ఇంటి నుంచి మెహబూబ్ ఔట్, అనుకున్నదే జరిగింది
కొవిడ్ కేర్ కేంద్రంలో దీపావళి వేడుకలు, కరోనా బాధితుల్లో కాస్త ఆనందం నింపేందుకు ప్రయత్నం