AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు పుట్టాక మహిళలు క్రికెట్ ఆడొచ్చా? కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ICC

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రసవం తర్వాత క్రీడాకారిణులు సురక్షితంగా మైదానంలోకి తిరిగి రావడానికి '6R' ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానం వైద్య పరీక్షలు, పునరుద్ధరణ, మానసిక ఆరోగ్యం, క్రమబద్ధమైన శిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది.

పిల్లలు పుట్టాక మహిళలు క్రికెట్ ఆడొచ్చా? కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ICC
Female Cricketer Postpartum
SN Pasha
|

Updated on: Jun 24, 2026 | 8:39 AM

Share

మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లు మళ్లీ ఆటలోకి సురక్షితంగా, సమర్థవంతంగా తిరిగి రావడానికి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 2026లో ప్రకటించిన ఈ మార్గదర్శకాలు మహిళా క్రీడాకారుల ఆరోగ్యం, శ్రేయస్సు, కెరీర్‌ నిరంతరతకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించారు. ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్, ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే నేతృత్వంలో రూపొందించిన ఈ విధానం ‘6Rలు’ (Ready, Review, Restore, Recondition, Return, Refine) అనే ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి ఉంది. ఇందులో ప్రసవానంతర కోలుకునే దశ నుంచి వైద్య పరీక్షలు, శారీరక పునరుద్ధరణ, క్రమబద్ధమైన శిక్షణ, మ్యాచ్‌లకు తిరిగి రావడం, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలు ఉన్నాయి.

డాక్టర్ ఫిలిప్పా ఇంజ్ మాట్లాడుతూ.. బిడ్డకు జన్మనివ్వడం ఒక మహిళా క్రీడాకారిణి కెరీర్‌కు ముగింపు కాదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సభ్య దేశాలు తమ మహిళా ఆటగాళ్లకు సరైన మద్దతు అందించి తిరిగి క్రికెట్‌లోకి తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి క్రీడాకారిణి పరిస్థితులు, కుటుంబ అవసరాలు వేర్వేరుగా ఉంటాయని, అందుకే ఈ విధానాన్ని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలని ఆమె సూచించారు. ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు స్వాగతించారు. డాక్టర్ రిచా భరద్వాజ్ మాట్లాడుతూ.. గర్భధారణ, మాతృత్వం కారణంగా మహిళలు తమ క్రీడా జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఐసీసీ బలంగా ఇచ్చిందన్నారు. గతంలో సరైన వైద్య సహాయం, మార్గదర్శకత్వం లేకుండా అనేక మంది మహిళా అథ్లెట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

ప్రసవం తర్వాత మహిళలు అనేక శారీరక, హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటారని డాక్టర్ భరద్వాజ్ వివరించారు. బలహీనమైన కోర్ కండరాలు, పెల్విక్ ఫ్లోర్ సమస్యలు, నిద్రలేమి, తగ్గిన స్టామినా, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు సాధారణమని చెప్పారు. కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి, మూత్ర నియంత్రణ లోపాలు, సిజేరియన్ గాయాల మానికలో ఆలస్యం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని తెలిపారు. క్రీడాకారిణులు త్వరగా పోటీల్లోకి దిగడం కంటే పూర్తిస్థాయి కోలుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. వైద్య పరీక్షలు, పోషకాహారం, తగిన విశ్రాంతి, మానసిక ఆరోగ్య సంరక్షణ, క్రమబద్ధమైన పునరావాస శిక్షణ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ప్రతి మహిళ కోలుకునే వేగం భిన్నంగా ఉంటుందని, బయట ఒత్తిళ్లకు లోనుకాకుండా శారీరకంగా సిద్ధమైన తర్వాతే మైదానంలోకి రావాలని ఆమె స్పష్టం చేశారు. ఐసీసీ తాజా చర్య మహిళా క్రికెటర్లకు మరింత భరోసా కల్పించడమే కాకుండా, మాతృత్వం, అంతర్జాతీయ క్రీడా జీవితం కలిసి సాగవచ్చనే సానుకూల సందేశాన్ని ప్రపంచానికి అందిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us