జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే వేళ ఉదయమంతా భారత రిపబ్లిక్ వేడుకలతో మురిసిన ఎర్రకోట మధ్యాహ్నం వేళ రైతుల నిరసనలకు వేదికగా మారింది. హస్తినలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించుకుని మరీ ముందుకు ఉరికిన రైతులు ఎర్రకోటపైకి చేరారు. రైతులు, రైతు సంఘాల నాయకుల నినాదాలతో ఒకదశలో ఎర్రకోట పరిసరాలు యుద్ధవాతావరణాన్ని తలపించాయి . ఏకంగా రైతులు ఎర్రకోట పైకెక్కి తమ జెండా ఎగురవేసి ఆందోళనకు దిగారు. ఎర్రకోటపై ప్రధాని జెండా ఎగురవేసే స్తంభం నుంచే తమ జెండాను కూడా ఎగురవేశారు రైతులు. అయితే, పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి ఎర్రకోటలోకి ప్రవేశించిన నిరసనకారులు ఒకానొక సందర్భంలో అల్లర్లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ, హిాంసాత్మక ఘటనలు, పోలీసులపై దాడులు, ప్రతిపక్ష, అధికార పక్ష నేతల స్పందనలు.. ఇలా రైతుల ఆందోళనకు సంంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ దిగువున..
హస్తినలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో అల్లరిమూకలు రెచ్చిపోయిన దృశ్యాలు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రైతుల ముసుగున కొందరు ఆకతాయిలు పెద్ద పెద్ద కర్రలతో భద్రతా సిబ్బంది మీద దాడి చేశారు. తమను అడ్డుకుంటున్న భద్రతా సిబ్బందిని పెద్ద పెద్ద కర్రలతో కొట్టారు. కొందరు ఆందోళనకారులు పెద్ద కర్రలతో భద్రతా సిబ్బంది మీద దాడి చేస్తుంటే, ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు బ్యారికేట్ల నుంచి గోడల నుంచి కిందకు దూకుతున్న దృశ్యాల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ దాడిలో మొత్తం 86 మంది భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు సమాచారం. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి.
#WATCH | Delhi: Protestors attacked Police at Red Fort, earlier today. #FarmersProtest pic.twitter.com/LRut8z5KSC
— ANI (@ANI) January 26, 2021
ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనమైన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సదరు రైతు మృతికి కారణాలను నిగ్గుతేల్చారు. ఉదయం ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉత్తరాఖండ్ కి చెందిన నవనీత్ అనే రైతు చనిపోవడానికి పోలీసులు జరిపిన కాల్పులే కారణమని రైతుల బృందం ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న కవాతులో పోలీసులు రణరంగం సృష్టించినట్లు రైతులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు మృతికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేశారు. సదరు వీడియోలో అతివేగంగా బారికేడ్లవైపు దూసుకొచ్చి ఓ ట్రాక్టర్ పల్టీకొట్టినట్లు కనబడుతోంది. ట్రాక్టర్ పల్టీ కొట్టిన ఘటనలో రైతు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
#WATCH | A protesting farmer died after a tractor rammed into barricades and overturned at ITO today: Delhi Police
CCTV Visuals: Delhi Police pic.twitter.com/nANX9USk8V
— ANI (@ANI) January 26, 2021
రిపబ్లిక్ డే వేళ ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన అల్లర్లపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని తాము ఊహించలేదన్నారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని ఆయన అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలిపారని, కానీ కొన్ని శక్తులు ఇందులో చేరి ఉండవచ్చ్చునని అమరేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అసలైన అన్నదాతలంతా మళ్ళీ ఢిల్లీ బోర్డర్ చేరుకోవాలని కోరుతున్నా అని అయన ట్వీట్ చేశారు. అన్నదాతల నిరసనను పరిగణనలోకి తీసుకుని వారి డిమాండును సాధ్యమైనంత త్వరగా కేంద్రం తీర్చాలని అమరేందర్ సింగ్ మోదీ సర్కారుకి విన్నవించారు.
రిపబ్లిక్ డే వేళ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించాయని పేర్కొన్నాయి. ఈ మేరకు 41 రైతు సంఘాల తరఫున సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ల పరేడ్‌లో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులందరికీ కృతజ్ఞతలు చెబుతూనే, ఈ సందర్భంగా హస్తినలో చోటుచేసుకున్న అవాంఛనీయ, అమోదయోగ్యంకాని ఘటనల్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి. అలాంటి చర్యలకు పాల్పడేవారిని దరిచేరనీయబోమని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తాము అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రూట్ మ్యాప్‌ను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీలో కొందరు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రజా ఆస్తులు కూడా దెబ్బతిన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ చెప్పారు. హింసకు పాల్పడవద్దని, శాంతిని కాపాడుకోవాలని ఆయన నిరసనకారులకు విన్నవించారు. అంతేకాదు, రైతులకు నిర్దేశించిన మార్గాల ద్వారానే తిరిగి వచ్చి తమతమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ర్యాలీకి అనుమతించిన మార్గాల గుండా కాకుండా ఇతర మార్గాల ద్వారా, నిర్ణీత సమయానికి ముందే రావడంతో పరిస్థితి విధ్వంసానికి దారితీసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనల్లో చాలా మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని శ్రీ వాస్తవ చెప్పారు.
ఇవాళ ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఇవి చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతుల నిరసనలకు తాను మొదటి నుంచీ మద్దతు ఇచ్చాను కాని, చట్టవిరుద్ధతను తాను క్షమించలేనని ఆయన తేల్చి చెప్పారు. రిపబ్లిక్ డేలో రోజున పవిత్రమైన తిరంగ పతాకం ఎర్ర కోట పైకి ఎగరాలికాని, ఇలాంటి ఘటనలు కాదన్నారు శశిథరూర్.
Most unfortunate. I have supported the farmers’ protests from the start but I cannot condone lawlessness. And on #RepublicDay no flag but the sacred tiranga should fly aloft the Red Fort. https://t.co/C7CjrVeDw7
— Shashi Tharoor (@ShashiTharoor) January 26, 2021
మోదీ సర్కారు తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఉప్పల్‌లో నిర్వహించిన రైతుల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అఖిలపక్షం మద్దతుతో చేసిన రైతు ర్యాలీ విజయవంతమైందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలు కొత్త చట్టాల పట్ల వ్యతిరేకతను తెలియజేస్తున్నాయన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మోదీ రాజ్యాంగానికి దినం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదని ఆరోపించారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు క్రమశిక్షణతో ఇంతకాలం ఢిల్లీలో నిరసన చేపట్టారని, కాని కేంద్ర ప్రభుత్వం వాటిని తీవ్రంగా పరిగణించలేదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇంతకాలం సంయమనం పాటించిన రైతులు, ఇప్పుడు మరో అడుగుముందుకేసి ట్రాక్టర్ మార్చ్ కు పిలుపునిచ్చారన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచడం కేంద్రం బాధ్యతన్న ఆయన, కానీ ఈ విషయంలో మోదీ సర్కారు విఫలమయిందని విమర్శించారు.
ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులతో సంబంధం లేని బయటి వ్యక్తుల వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. రైతుల ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు కొందరు కుట్ర పన్ని ఈ పని చేశారని ఆ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన హింసాత్మక సంఘటనలను ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.రైతు నిరసనలో ఈరోజు జరిగిన హింసాత్మక ఘటనలను ఆప్ ఖండిస్తుందని, పరిస్థితులు ఈ స్థాయికి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించింది.
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కారణంగా ఈ సారి ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ‘కొత్తగా కనిపిస్తున్నాయని’ బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. మోదీ సర్కారు తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ.. ఇకపై ఏదైనా చట్టం చేస్తే రైతులను సంప్రదించాలని తాను కోరుతున్నానని ఆమె అన్నారు. ప్రభుత్వం ఈ సలహాను స్వీకరించి ఉంటే ‘కొత్తరకం రిపబ్లిక్ డే వేడుకలు జరిగేవి కాదు..’ అని మాయావతి ఎద్దేవా చేశారు. దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇవాళ దేశంలో పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం లాంటి సమస్యలు ఉండేవి కాదని ఆమె అన్నారు. ఎప్పటి మాదిరిగానే గణంతంత్ర దినోత్సవం నాడు వేడుకలు చేసుకునే బదులు… ఇప్పటి వరకు పేదలు, రైతులు, కష్టపడి పనిచేస్తున్న కార్మికులు ఏం కోల్పోయారనే దానిపై విశ్లేషణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
మార్కెట్లలో దోపిడీ శక్తుల నుంచి తమకు రక్షణ కావాలని రైతులు కోరుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తమ హక్కులను రక్షించుకోవడం కోసమే రైతులు ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి సంఘీభావంగా మంగళవారం హైదరాబాదులో అఖిలపక్షం మద్దతుతో నిర్వహించిన రైతు ర్యాలీలో ఆయన మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సాగు చట్టాలతో కార్పొరేట్ కంపెనీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆయన విమర్శించారు.
ఢిల్లీలో మంగళవారం జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని, అన్నదాతలు చేస్తున్న డిమాండుపై ఇప్పటికైనా కేంద్రం స్పందించి వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని ఆయన కోరారు. హింస వల్ల దేన్నీ సాధించలేమన్నారు.
हिंसा किसी समस्या का हल नहीं है। चोट किसी को भी लगे, नुक़सान हमारे देश का ही होगा।
देशहित के लिए कृषि-विरोधी क़ानून वापस लो!
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2021
ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తోన్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు, బాష్ఫవాయు గోళాలను సైతం ప్రయోగించడాన్ని సీపీఐ (ఎం) కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పలు ప్రశ్నలు సంధిస్తూ కేంద్రాన్ని నిలదీశారు.రైతులపై బాష్ఫవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం సరికాదని సీతారం ఏచూరి పేర్కొన్నారు. అలాంటప్పుడు రైతులు, ఢిల్లీ పోలీసుల మధ్య చర్చలు, ఒప్పందం ఎందుకని.. ప్రభుత్వం ఎందుకు గొడవను పెంచుతోందని ఆయన ప్రశ్నించారు. రైతులు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీని కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌లో డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.
Tear gassing & lathicharging Kisans is unacceptable.
Why, after the Delhi Police & Samyukt Kisan Morcha agreement?
Why is the government provoking a confrontation.
They must allow the peaceful, agreed tractor parade to continue.https://t.co/oVwpEdWF6S— Sitaram Yechury (@SitaramYechury) January 26, 2021
మోదీ సర్కారు కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన అనంతరం మరికొందరు రైతులు తమ మనసులో మాటలు బయటపెట్టారు. మోదీ ప్రభుత్వానికి ఓ సందేశం ఇవ్వడానికి తాము ఇక్కడకు వచ్చామని, తమ పని ముగిసిందని, ఇక తిరిగి వెళ్తున్నామని అన్నారు. కానీ రైతు చట్టాలను రద్దు చేయాలన్న తమ లక్ష్యం మాత్రం మారదన్నారు.
ఢిల్లీలో ఈ మధ్యాహ్నం కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో నిర్వహించిన కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. పారామిలిటరీ దళాలను హైఅలెర్ట్‌లో ఉండాలని, ఎర్రకోట దగ్గర మరిన్ని బలగాలను మోహరించాలని ఆదేశాలిచ్చారు. కాగా, ఈ ఉదయం రైతులు తమకు కేటాయించిన రూట్‌లో కాకుండా మరో రూట్‌లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి సెంట్రల్ ఢిల్లీలోకి దూసుకొచ్చిన నేపథ్యంలో పలు హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.
హర్యానాలోని మానేసర్‌లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ – జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే మీద రాకపోకల్ని అడ్డుకొని కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#WATCH | Farmers stage protest against the three agriculture laws at Delhi-Jaipur Expressway in Manesar, Haryana. pic.twitter.com/F42FUhwEiy
— ANI (@ANI) January 26, 2021
రైతుల ట్రాక్టర్ల ర్యాలీ దేశ రాజధాని ఢిల్లీలో పరుగులు తీస్తుండటంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం పలు మెట్రో స్టేషన్లు మూసివేసింది. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీలలోని మెట్రో స్టేషన్లను మూసివేసింది. గ్రీన్ లైన్, యెల్లో లైన్‌లలోని కొన్ని స్టేషన్ల ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాలను మూసివేసినట్లు డీఎంఆర్‌సీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఐటీఓ, ఇంద్రప్రస్థ, లాల్ కిలా స్టేషన్లను మూసివేసినట్లు పేర్కొంది. మరొక ట్వీట్‌లో బ్రిగేడియర్ హోషియార్ సింగ్, బహదూర్ గఢ్ సిటీ, పండిట్ శ్రీరామ్ శర్మ, టిక్రి బోర్డర్, టిక్రి కలాన్, ఘేవ్రా, ముండ్క ఇండస్ట్రియల్ ఏరియా, ముండ్క, రాజధాని పార్క్, నంగ్లోయ్ రైల్వే స్టేషన్, నంగ్లోయ్ మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు పేర్కొంది. మరొక ట్వీట్‌లో, సమయ్‌పూర్ బడ్లీ, రోహిణి సెక్టర్ 18/19, హైదర్‌పూర్ బడ్లి మోర్, జహంగీర్ పురి, ఆదర్శ్ నగర్, ఆజాద్‌పూర్, మోడల్ టౌన్, జీటీబీ నగర్, విశ్వవిద్యాలయం, విధాన సభ, సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో వెల్లడించింది.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రాజధాని హస్తినలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది.
నేటి రైతు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అపూర్వమైన భాగస్వామ్యం అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపింది సంయుక్త కిసాన్ మోర్చ. అయితే, ఈ రోజు జరిగిన అవాంఛనీయ, ఆమోదయోగ్యం కాని సంఘటనలను తాము ఖండిస్తున్నామని ప్రకటించింది. అంతేకాదు, ఇలాంటి ఘటనలపట్ల చింతిస్తున్నామని, అలాంటి చర్యలకు పాల్పడే వారి నుండి దూరంగా ఉంటామని సంయుక్త కిసాన్ మోర్చ ప్రకటించింది.
కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గణతంత్ర పరేడ్ పేరిట రిపబ్లిక్ డే వేళ హస్తినలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, వాటిపై రైతులే దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ట్రాక్టర్లతో రైతులంతా దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ఐటీవో నుంచి ఎర్రకోట చేరుకున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసనతో దేశ రాజధాని నగరం ఉద్రిక్తంగా మారింది. రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకమైంది. 72వ గణతంత్ర దినోత్సవంరోజు రైతుల ట్రాక్టర్ రిపబ్లిక్ డే ర్యాలీలో ఢిల్లీ ఐటిఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించినట్లు తెలుస్తోంది. నగరంలోకి చొచ్చుకొచ్చిన రైతులను నిలవరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీలు ఝళిపించారు. దీంతో ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈక్రమంలో ఢిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు మృతి చెందారని రైతు ఉద్యమకారులు చెబుతున్నారు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ హస్తిన ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ ప్రభుత్వం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసింది. సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా పలు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు, ఇతర దేశాలు ప్రోత్సహిస్తోన్న సామాజిక వ్యతిరేక శక్తులు రైతుల ముసుగులో ఆందోళనలో చొరబడ్డారని కర్నాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ ఆరోపించారు. ఖలిస్థాన్ ప్రజల మద్ధతుతోనే ఈ నిరసన చేపడుతున్నారని ఆయన విమర్శించారు. అంతేకాదు, ఈ రైతు వ్యతిరేక శక్తుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎర్రకోటను సరదా ప్రాంతంగా మార్చేసి హంగామా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రంగ్ దే బసంతి’, ‘జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేస్తూ లక్షలాది రైతులు..ట్రాక్టర్లు, బైకులు, చివరకు గుర్రాలపై కూడా వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ చేరుకున్నారు. కొందరు క్రేన్లను కూడా నగరంలోకి తెచ్చారు. స్థానికుల్లో పలువురు రోడ్లకు రెండు వైపులా నిలబడి పూల రేకులు చూపుతూ, డ్రమ్స్ వాయిస్తూ వారికి స్వాగతం తెలిపారు. పతాకాలతో నిండిన వాహనాలపై నిలబడి అన్నదాతల్లో కొంతమంది..’సారే జహాసే అచ్చా’ వంటి దేశభక్తి గీతాలు పాడుతూ డ్యాన్సులు చేశారు. మొత్తానికి ఉదయం ప్రశాంతంగా ఉన్న నగరం కొద్దిసేపటికే అత్యంత ఉద్రిక్తంగా మారిపోయింది.
రాజధాని హస్తినలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ బీభత్సంగా మారింది. పెద్ద సంఖ్యలో రెడ్ ఫోర్ట్ చేరుకున్న వీరు కనీవినీ ఎరుగని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. సెంట్రల్ ఢిల్లీలో ఓ రైతు పోలీసులపైకి ట్రాక్టర్ నడిపించడానికి యత్నించడంతో ఖాకీలు చెల్లా చెదరయ్యారు. ఇదే చోట బస్సులపై వారు రాళ్ళూ రువ్వారు. ఖాకీలపైకి పొడవాటి కత్తులను ఝళిపించారు. వీరి దాడుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో పోలీసులు పలు రోడ్లను మూసివేశారు.