ప్రాణకోటి మనుగడలో చెట్ల ప్రాధాన్యత అంతాఇంతా కాదు. చెట్ల విలువ తెలుసుకోకుండా అడవులను విచ్చలవిడిగా నరికేస్తుండడంతో ప్రపంచ దేశాలు గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. చెట్టు ప్రాధాన్యతను గుర్తించింది జబల్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబం.
జబల్‌పూర్‌కు చెందిన కేశర్వాని కుటుంబం 1994లో తమ ఇంటి నిర్మాణాన్ని విస్తరించాలనుకుంది. ఆ సమయంలోనే ఇంటి ఆవరణలోని తోటలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు విస్తరణ పనులకు అడ్డుగా ఉండటాన్ని గుర్తించారు. చెట్ల ప్రాధాన్యతను తెలుసుకున్న ఆ కుటుంబం దానిని నరకకుండా ఇంటి నిర్మాణాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. చెట్టును ఏమాత్రం కదిలించకుండా ఏకంగా నాలుగు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. మొదట్లో దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా అలవాటు పడ్డామని ఇంటి యజమాని యోగేశ్ కేశర్వాని వివరించారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు ఇప్పటికీ ప్రతి ఏడాది కొమ్మలు, ఆకులు, పండ్లతో అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అది తమ జీవితంలో భాగమైపోయిందని, తమ కుటుంబసభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నామని ఆయన అన్నారు.