మాంసాహారులారా జర జాగ్రత్త.. అప్రమత్తంగా లేకపోతే అపాయమే.. ఆ తర్వాత ఆస్పత్రులే దిక్కు..

| Edited By: Pardhasaradhi Peri

Nov 20, 2020 | 3:56 PM

ముక్క లేనిదే ముద్ద దిగదు కొంతమంది మాంసం ప్రియులకు.. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు వారి హడావిడి అంతా ఇంతా కాదు..

మాంసాహారులారా జర జాగ్రత్త.. అప్రమత్తంగా లేకపోతే అపాయమే.. ఆ తర్వాత ఆస్పత్రులే దిక్కు..
Follow us on

ముక్క లేనిదే ముద్ద దిగదు కొంతమంది మాంసం ప్రియులకు.. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు వారి హడావిడి అంతా ఇంతా కాదు.. ఉదయమే వెళ్లి మటన్, చికన్ సెంటర్ల దగ్గర క్యూలో నిలుచుంటారు. దగ్గరుండి మరీ వారికి నచ్చిన ఐటం వేయించుకొని సంబరపడుతారు. అలాంటి మాంసం ప్రియుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యాపారులు.. కుళ్లిన మాంసం విక్రయాలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మాంసం మాఫియా రెచ్చిపోతోంది.. అనారోగ్యంతో మృతి చెందిన మేకలు, గొర్రెలు, కోళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని శుభ్రంగా కడిగి ఏమి తెలియనట్లు అమ్మకాలు జరుపుతోంది.. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తోంది.. అధిక ధరకు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటోంది.. ప్రభుత్వ నిబంధనల మేరకు మాంసం వ్యాపారులు జంతువుల శరీరంపై వీఎంసీ స్టాంప్ వేయించుకొని అమ్మకాలు జరపాలి కానీ వ్యాపారులు అలా చేయడం లేదు. కొంతమంది మాత్రం ఒక జంతువుపై స్టాంప్ వేయించుకొని దానిని చూపిస్తూ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. అడపదడపా అధికారులు దాడులు చేసి కొంతమందిని అరెస్ట్ చేసినా.. లాభాలు అధికంగా ఉండటం వల్ల వ్యాపారులు ఈ దందాను వదిలిపెట్టడం లేదు..

బందరు రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన 400 కిలోల మాంసాన్ని ఇటీవల పుడ్ ఇన్స్‌పెక్టర్లు, వీఎంసీ అధికారులు గుర్తించారు. ఫ్రిజ్‌లో ఉంచిన పురుగులు పట్టిన మాంసంతోనే ఆహార పదార్థాలు వండడం స్థానికంగా కలకలం సృష్టించింది. మరో దగ్గర చనిపోయిన మేక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులను అధికారులు పట్టుకున్నారు. ఆ మాంసం నుంచి పురుగులు బయటికి రావడాన్ని అందరూ వింతగా చూశారు. ఇదిలా ఉంటే కొంతమంది వ్యాపారులు మటన్‌లో బీప్ కలిపి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ మూడు పూవులు ఆరు కాయలుగా అడ్డంగా సంపాదిస్తున్నారు.