
ఇరాక్‌లోని అమెరికన్ టార్గెట్లపై ఇరాన్ మిసైల్ దాడుల అనంతరం.. ‘పెద్దన్న’ డొనాల్డ్ ట్రంప్.. ఆగ్రహంతో ఊగిపోతాడని, ఆ దేశంపై యుధ్ధాన్ని ప్రకటించి బీభత్సంగా చెలరేగిపోతాడని అంతా అనుకున్నారు. పైగా అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా గోల్డ్, క్రూడ్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఎందుకో.. అమెరికా అధ్యక్షులవారి వైఖరి మారి.. సీన్ కాస్త రివర్స్ అయింది. ఏదో పెద్ద ప్రకటనే చేస్తాడని ఆశించినవారి అంచనాలను ఆయన తలకిందులు చేస్తూ వారిని షాక్‌కి గురి చేశాడు. బుధవారం వైట్ హౌస్‌లోని తన సిచువేషన్ రూమ్‌లో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి ఎస్పెర్, ఇతర భద్రతాధికారులతో సమావేశమైన ఆయన.. చేతులు ముడుచుకుని.. అసలు ఏమీ కానట్టే మౌనంగా కూర్చున్నాడు. ఈ సమావేశానికి హాజరైనవారందరి ముఖాల్లో సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్ కనిపించాయి గానీ.. ట్రంప్ గారిలో మాత్రం పెద్దగా ఎలాంటి ఎమోషన్ కనిపించలేదు.
ఇక ఇరాన్ పని అయిపోయిందని, వాళ్ళు మన దేశాన్ని ఎదిరించజాలరని బుధవారం ఉదయం తన దేశ ప్రజలనుద్దేశించి ధాటిగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న ట్రంప్.. సాయంత్రానికల్లా హఠాత్తుగా ఎందుకు కూల్ అయిపోయారో అర్థం కాక.. ఆయన ‘ వందిమాగధులంతా ‘ తలలు పట్టుకున్నారు. మొత్తానికి ఇరాన్ తో అమెరికా యుధ్ధం ‘ బూచి ‘ అన్న విషయం వారికి అర్థమైనట్టు ఉంది. అటు ఇరాన్ కూడా శాంతిమంత్రం జపించడంతో ఆ దేశ మిసైల్ ఎటాక్స్ యవ్వారమంతా హిస్టరీపేజీల్లో మాత్రమే కనిపించబోతోంది.