వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఉగ్రవాదుల్లా కనబడుతున్నారా అని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అన్నదాతలకు, జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేయడంపై మండిపడిన ఆయన.. వీరు వేర్పాటువాదులా లేక టెర్రరిస్టులా అన్నారు. ఈ విధమైన ఎత్తుగడలు రైతుల న్యాయమైన డిమాండ్లను బలహీనపరచజాలవన్నారు. కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోందని, కానీ దీనివల్ల వారి ఆందోళన మరింత ఉధృతమవుతుంది తప్ప తగ్గదని ఆయన అన్నారు. ఇది వారిని రెచ్చగొట్టినట్టే అవుతుందన్నారు. పంజాబ్ ఆప్ శాఖ కూడా రైతులకు ఎన్ డీ ఏ సమన్లు జారీ చేయడంపై మండిపడింది. మోదీ ప్రభుత్వం ఓ వైపు రైతులతో చర్చలు జరుపుతూ మరోవైపు వారిని బెదిరించేందుకు తన దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందని ఆప్ నేత భగవాన్ మాన్ ఆరోపించారు. అన్నదాతల ఆందోళనను సిఖ్స్ ఫర్ జస్టిస్ సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ రైతు సంఘాలకు కొన్నింటికి నోటీసులు పంపింది.