తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో పోరుకు సిద్ధమైంది. సెకండ్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే చెన్నై ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ముంబైతో గెలిచి.. రెండో మ్యాచ్‌లో 217 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న ఢిల్లీ, వీటిల్లో ఎంతో అనుభవం ఉన్న చెన్నై నుంచి సవాల్ ఎదురుకానుంది.
రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై ఓడినప్పటికీ.. కొన్ని సానుకూలతలు కనిపించాయి. తొలి మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్.. సెకండ్ మ్యాచ్‌లో చెలరేగడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు వాట్సన్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు.
ముంబై మ్యాచ్‌లో గాయపడ్డ అంబటి రాయుడు.. ఢిల్లీతో మ్యాచ్‌లో అందుబాటులో ఉండడని ఇప్పటికే సీఎస్‌కే ప్రకటించింది. దీంతో మళ్లీ రుతురాజ్‌కే అవకాశం దక్కనుంది. ధోని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ దిగడంపై అభిమానులు, సీనియర్ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు తప్పవని భావిస్తున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై జడేజా సహా ఐదుగురు బౌలర్లనే వాడటం మంచి వ్యూహం అని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి మ్యాచ్‌లో మంచి ఆరంభం దక్కలేదు. స్టోనియిస్ తప్పా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంత్, శిఖర్ ధవన్ ఫామ్‌లోకి వస్తేనే చెన్నైకి గట్టి పోటీనివ్వగలదు. ఇక బౌలింగ్ విభాగాన్ని చూస్తే అశ్విన్‌కు గాయం కావడం కలవరపెడుతోంది. అశ్విన్ అందుబాటులోకి రాకపోతే చెన్నైని కట్టడి చేయడం అంత సులువు కాదని అంచనా.