Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘాటెక్కుతున్న ఉల్లిగడ్డ.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అనేలా ఉంది సామన్యుడి పరిస్తితి. కూరలో ఉల్లి వాసన లేకపోతే అది కూరే కాదు. మార్కెట్లో ఉల్లి ధర రోజు రోజుకు పెరగడంతో సామన్య మధ్య తరగతి జనం ఉల్లి పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఉల్లి ఘాటుకు కాకుండా దాని ధరకు భయపడుతున్నారన్నమాట. బహిరంగ మార్కెట్లో ఉల్లిధరలు అమాంతం పెరిగిపోయాయి. గత నెలలో కిలో ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి రూ.25 ఉండేది. కానీ వారాలు […]

ఘాటెక్కుతున్న ఉల్లిగడ్డ.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 23, 2019 | 11:04 AM

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అనేలా ఉంది సామన్యుడి పరిస్తితి. కూరలో ఉల్లి వాసన లేకపోతే అది కూరే కాదు. మార్కెట్లో ఉల్లి ధర రోజు రోజుకు పెరగడంతో సామన్య మధ్య తరగతి జనం ఉల్లి పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఉల్లి ఘాటుకు కాకుండా దాని ధరకు భయపడుతున్నారన్నమాట. బహిరంగ మార్కెట్లో ఉల్లిధరలు అమాంతం పెరిగిపోయాయి. గత నెలలో కిలో ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి రూ.25 ఉండేది. కానీ వారాలు గడిచే కొద్దీ ధర పెరగడంతో అసలు వాటిని చూస్తేనే భయపడే పరిస్థితి వచ్చింది.

ఉల్లిగడ్డ ధర పెరగడంలో దేశంలో ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలున్నాయి. దీన్ని కేవలం కూరలో ఉల్లిపాయే కదా అని అంత సులభంగా తీసిపారేయలేం. ప్రస్తుతం ఉల్లిగడ్డ ధర కిలో. రూ.60 నుంచి రూ.80 పలుకుతుంది. ధర అమాంతం పెరిగిపోడానికి కారణం ఏమిటో అర్ధం కాక సామన్య ప్రజలు జుట్టుపీక్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రైతు మార్కెట్లలోనైన కాస్త ధర తక్కువగా ఉంటుందనుకుంటే అక్కడ కూడా గూబ గుయ్ మనే విధంగానే ఉన్నాయి. దీంతో తమ సంసారాలు ఎలా చేయాలో అర్ధం కాక సతమతమవుతున్నారు మహిళలు.

ధరలు ఎందుకు పెరిగాయి?

చూస్తుండగానే గోదావరి వరదలు గ్రామాలను ముంచేసినట్టుగా వారం తిరిగేలోపుగానే మార్కెట్లో ఉల్లిధర ఆకాశాన్నంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇలా పెరిగాయి అంటే చాలా కారణాలున్నాయి అని చెప్పక తప్పదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా ఉంటుంది కూరగాయల ధరల పెరుగుదల విషయం. ముఖ్యంగా ఉల్లి పంట ఎక్కువగా ఉండే కర్ణాటక.. మహారాష్ట్ర.. ఏపీ నుంచి సరఫరా కావాల్సిన ఉల్లి తగినంత మేర దిగమతి చేసుకోకపోవడంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగా సాగు అవుతుంది. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. దీంతోపాటు ఉల్లి సాగు కూడా తగ్గిపోవడం మరో ప్రధాన కారణం. డిమాండ్‌కు తగ్గట్టుగా దిగుబడి లేకపోవడం కారణంగా కొరత ఏర్పడుతుంది. గతంలో ఉల్లికి సరైన ధర రాకపోవడంతో రైతులు సాగుచేయడానికి వెనకడుగు వేశారు. దీని ఫలితంగా ఇప్పుడు సామాన్యుడు ఇంత ధర చెల్లించాల్సి వస్తోంది.

పెరిగిన రవాణా ఛార్జీలు

మార్కెట్లో మనం కొనుగోలు చేసే ఉల్లిపాయలు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉల్లి తరలింపులో బస్తాకు అయ్యే చార్జీలు బాగా పెరిగాయి. దీనివల్ల మార్కెట్లో ధర కొనుగోలు, రవాణ వంటి వాటిని కలుపుకుని సహజంగానే పెరిగిపోతుంది.

కృత్రిమ కొరత (బ్లాక్ మార్కెట్ )

అన్నిటికంటే అధికధరలక కారణమయ్యే అసలు విషయం ఇదే. కొంతమంది వ్యాపారస్తులు ముందుగానే పరిస్థితిని అంచనావేసి సరుకును దాచిపెడుతూ ఉంటారు. దీన్ని ప్రత్యేక గోదాముల్లో దాచిపెట్టి సమాయానికి బయటకు తీసి అధిక ధరకు అమ్ముతూ ఉంటారు. దీనినే బ్లాక్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. నిజానికి బ్లాక్ మార్కెట్ అనేది లేకపోతే ఏ వస్తువు ధర అంత త్వరగా పెరిగే అవకాశం లేదు.

పెరిగిన ఉల్లి వినియోగం

ఉల్లిపాయలను కేవలం వంటగదిలో మాత్రమే వినియోగిస్తారని అనుకుంటే అది పొరబడినట్టే. కేవలం కూరల్లో మాత్రమే కాకుండా బయట ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ తింటున్నా పైన ఉల్లిపాయ ముక్కలు లేకపోతే దాని రుచిలోపించినట్టే. ఇదిలా ఉంటే ఇటీవల సౌందర్య సాధనంగా కూడా దీన్ని వినియోగిస్తుండటంతో ఆయా కంపెనీలు వాటిని అధిక ధరకు కొనుగోలు చేస్తు వారివద్ద స్టాక్ పెట్టుకుంటున్నారు. ఉల్లిపాయ రసం తలకు పట్టించడం వల్ల జట్టు ఒత్తుగా నున్నగా, నల్లగా మారుతుందని ప్రకటనలు సైతం చూస్తూనే ఉన్నాం.

పట్టించుకోని ప్రభుత్వాలు

ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజు రోజకు పెరుగుతున్న ఉల్లి ధరను తగ్గించే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. గతంలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు రైతు మార్కెట్లలో టోకెన్లు పెట్టి మరీ అమ్మకాలు జరిపారు. టమాట ధర కూడా ఇలాగే పెరిగినప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఇక ఉల్లిధర పెరగకుండా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. సామాన్యునికి అందకుండా పోతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేయాల్సి అవసరం చాలా ఉంది. లేకపోతే ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయి.