ధర్మపురిలో గోదావరి మహా హారతి కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చిన్నజియర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంపూర్ణానంద బ్రహ్మచారి కూడా ఉత్తరభారతదేశం నుంచి అతిథిగా విచ్చేశారు. వీరితోపాటు.. మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ నేత మురళీధర్ రావు చేతులమీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
కార్తీకమాసం.. హిందువులు పరమపవిత్రంగా భావించే నెల. శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది ఈ మాసం. హరిహరులిద్దరికీ ఈ మాసంలో పూజలు చేస్తే నేరుగా వారికే చెందుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో.. జగిత్యాల జిల్లా ధర్మపురి తీరంలో గోదావరి నదిపై మహాహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్నజియర్ స్వామి, ఉత్తర భారతం నుంచి పరిపూర్ణానంద బ్రహ్మచారి స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మహాహారతికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆర్టికల్ 370 రద్దుతో భారతమాత చిరునవ్వులు చిందిస్తోందన్నారు చిన్నజియర్ స్వామి. భారతదేశం హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిందన్నారు. రాబోయే కాలంలో దేశాల మధ్య నీటిబోట్టు కోసం యుద్ధాలు జరుగుతాయన్నారు. అయితే రాష్ట్రంలో భగీరథ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
గోదావరి తీరంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించడం శుభసూచకం అన్నారు మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మురళీధర్ రావుకు, విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతీ ఏటా నిర్వహిస్తున్నామన్నారు ఉత్సవసమితి చైర్మన్, బీజేపీ నేత మురళీధర్ రావు. సభకు విచ్చేసి ఆశీర్వదించిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదారమ్మకు నిర్వహించిన హారతి కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.