అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో అధికారం నుంచి వైదొలగుతున్న తరుణంలో ఆయన ప్రభుత్వం ఇప్పటివరకు తమపట్ల అనుసరిస్తూ వచ్చిన వైఖరిని చైనా తీవ్రంగా తప్పు పట్టింది. ట్రంప్ ప్రభుత్వం మా పట్ల కోల్డ్ వార్ పాలసీని పాటిస్తూ వచ్చిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఆరోపించారు. ట్రేడ్ టారిఫ్, టిబెట్, తైవాన్, హాంకాంగ్ వంటి అంశాల్లో తమ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ని విమర్శించడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ ట్రంప్ వదులుకోలేదని. పైగా కరోనా వైరస్ తమ దేశం నుంచే పుట్టిందని పదేపదే ఆరోపిస్తూ వచ్చారని ఆయన దుయ్యబట్టారు. ప్రపంచ దేశాలు దీన్ని ఖండించినా ఆయనవైఖరి మారలేదన్నారు. కానీ త్వరలో అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ఈ విధమైన కయ్యాలమారి పాలసీలను విడనాడి తమ ఉభయ దేశాల మధ్య సాధారణ సంబంధాల పునరుధ్ధరణకు కృషి చేయగలరన్న ఆశాభావాన్ని వాంగ్ వ్యక్తం చేశారు. కొత్త ఆశలు తమలో మోసులెత్తుతున్నాయని, రెండు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడగలవని భావిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోని విషయమే తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అమెరికా పరిణామాలను తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని వాంగ్ చెప్పారు. ఈ నెల 20 న ట్రంప్ అధికారం నుంచి వైదొలగడం, బైడెన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం జరగనున్నాయి. కానీ… ట్రంప్ మాత్రం ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించకపోవడమే విడ్డూరం.
Read More:
పాకిస్తాన్ లో హిందూ ఆలయం కూల్చివేత సబబే ! మత ప్రచారకుడు జకీర్ నాయక్, ఇది ఇస్లామిక్ దేశమని ప్రకటన
DCGI LIVE Updates : రెండు వ్యాక్సిన్లకు నిపుణుల కమిటీ ఓకే.. అనుమతులపై డీసీజీఐ క్లారిటీ