రాజకీయాల్లో చేరాలని ముచ్చటపడిన రౌడీకి క్లయిమాక్స్‌లో ఏం జరిగిందంటే…

|

Sep 01, 2020 | 7:25 PM

ఈ మధ్యన రౌడీలు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు తెగ ముచ్చటపడుతున్నారు.. ఇట్టాగే తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన ఓ పేరుమోసిన రౌడీకి కూడా రాజకీయాల్లోకి వచ్చి హవా నడిపించాలనుకున్నాడు..

రాజకీయాల్లో చేరాలని ముచ్చటపడిన రౌడీకి క్లయిమాక్స్‌లో ఏం జరిగిందంటే...
Follow us on

ఈ మధ్యన రౌడీలు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు తెగ ముచ్చటపడుతున్నారు.. ఇట్టాగే తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన ఓ పేరుమోసిన రౌడీకి కూడా రాజకీయాల్లోకి వచ్చి హవా నడిపించాలనుకున్నాడు.. అందుకు ఓ భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాడు.. ముహూర్తం కూడా పెట్టుకున్నాడు.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు సకలం సిద్ధం చేసుకున్నాడు. అంత భారీ ఎత్తున కాకపోయినా ఓ మోస్తరు సభను ఏర్పాటు చేసుకున్నాడు.. బాస్‌ పార్టీలో చేరితే తాము ఉత్తినే ఉండటం ఎందుకని రౌడీ అనుచరులు కూడా పార్టీ కండువా వేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక సభ ప్రారంభం కావడమే తరువాయి.. అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు.. పోలీసులను చూడగానే సదరు రౌడీకి ముచ్చెమటలు పట్టేశాయి.. వెంటనే అక్కడ్నుంచి దౌడు తీశాడు.. ఎంత పేరుమోసిన రౌడీ అయినా అతడికి ఓ పేరుంటుంది కదా! అతడి పేరు సూర్య… అతగాడిపై పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయట! సూర్యతో పాటు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఓ నలుగురు అనుచరులు మాత్రం పోలీసులకు చిక్కారు.. ఈ తతంగమంతా చూసిన మురుగన్‌ బిత్తరపోయి పోలీసులతో విషయం అడిగి తెలుసుకున్నారు.. సూర్యపై 35కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయట! ఇందులో ఆరు మర్డర్‌ కేసులు కూడా ఉన్నాయట! ఇంతకాలం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడట! సూర్యకు ఇంత చరిత్ర ఉందని తెరియాదు తంబి అని మురుగన్‌ ఓట్టేసి మరీ చెప్పారట! ఇక నుంచి పార్టీలో చేరాలనుకునేవారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని మురుగన్‌ డిసైడయ్యారు..