దేశంలో కరోనా వైరస్ విజృంభణ అంతకంతకు పెరుగుతూనే ఉంది. కరోనా మహమ్మారి వైరస్ దేశ నలుమూలలా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో వెలుగుచూస్తునే ఉన్నాయి. వరుసగా వారం రోజులపాటు 70 వేలకు పైగా కేసులు నమోదవగా, గత రెండు రోజులు మాత్రం 69 వేలకు తక్కువగా రికార్డయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో 84 వేలకు దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కరోజులో ప్రపంచంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 83,883 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 38,53,407కు చేరుకుంది. ఇందులో 8,15,538 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 29,70,493 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనాతో కొత్తగా 1,043 మంది మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 67,376కు చేరాయి.
ఇక, దేశంలో నిన్న 11,72,179 మందికి కరోనా పరీక్ష నిర్వహించామని భారత వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 2 వరకు దేశవ్యాప్తంగా 4,55,09,380 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.