రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారులను అవమానించేలా టీఆర్‌ఎస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో తాము పనిచేయలేమని పోలీసులు బాహాటంగా చెబుతున్నారని పేర్కొన్నారు. కాగా ఆదిలాబాద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్‌తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. భైంసా లో హిందువుల ఇళ్లను దగ్ధం చేస్తే పట్టించుకోలేదని విమర్శించారు. ఎంఐఎం గుండాలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారని ఆరోపించారు. వారు నానాయాగీ చేస్తున్నారని అయినా హోం మంత్రి స్పందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ఎంఐఎం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎండోమెంట్ స్థలాలను కాపాడాలని బీజేపీ నేతలు కోరితే.. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎవరి కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు.
కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ఒకసారి సీఎం ఫాంహౌజ్‌ను తనిఖీ చేయాలని అన్నారు. పదే పదే ఆయన అక్కడికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలను నిర్విర్యం చేస్తున్నారని, రెండేళ్లైనా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. 2023లో ప్రజలే కేసీఆర్కు పెన్షన్ ఇస్తారని అన్నారు. తమ కార్పొరేటర్‌పై దాడి జరగడంపైనా బండి స్పందించారు. మేము తిరిగి దాడి చేయడం పెద్ద పనేమీ కాదని అన్నారు.