Banana Price Down: అరటి ధర.. పతనమైంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పేదోడి పండుగా పిలిచే అరటిని శుభకార్యాలకు విరివిగా వాడుతుంటారు. అయితే ఇప్పుడు దాని ధరలు పడిపోవడంతో.. వాటిని పండించే రైతులకు కన్నీళ్లు మిగిలుతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టి పండించిన అరటి గెలలకు ప్రస్తుతం గిట్టుబాటు ధరలు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
కర్నూలు జిల్లాలో అరటి గెలల ధరలు భారీగా పతనమయ్యాయి. అక్కడి రైతులు కిలో అరటిని కేవలం రెండు రూపాయలకే విక్రయిస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరైతే మూగ జీవాలకు ఆహారంగా వేస్తున్నారు. చాగలమర్రి మండలం చిన్న వంగాలిలో చంద్ర ఓబుళరెడ్డి అనే రైతు తన తోటలోని అరటి గెలలను మూగ జీవాలకు వదిలేశాడు. లక్షలాది రూపాయలు పెట్టి పండిస్తున్నామని.. ప్రస్తుత ధరలు కూలీల ఖర్చులకు కూడా సరిపోవట్లేదని అరటి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. కాగా మొన్నటికి మొన్న టమోటా ధరలు దారుణంగా రూపాయికి పడిపోయి రైతులు కష్టాలు మిగిల్చిన సంగతి విదితమే.