
పల్నాడు ప్రాంత కరవు నివారణ కోసం రూ.6,020 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పథకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో గోదావరి-పెన్నా ఫస్ట్ ఫేజ్ పేరుతో ఈ పథకాన్ని 2 ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ, నవయుగ-ఆర్‌వీఆర్ సంస్థలు ఈ పనులను దక్కించుకున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. అయితే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 9.61లక్షల ఎకరాల స్థిరీకరణకు ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఉందని, కరవు నివారణకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో తాజాగా సీఎం జగన్ వద్ద జరిగిన మీటింగ్ లో పనులు తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 2 ప్యాకేజీల పనులు కొనసాగించేందుకు పై కంపెనీలను పర్మిషన్ ఇస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.
గోదావరి బనకచర్ల పెన్నా అనుసంధాన ప్రాజెక్టు విధివిధానాలకు సంబంధించి సర్కార్.. ఇప్పటికే పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను తయారు చేయమని వ్యాప్కోస్‌కు బాధ్యతను అప్పచెప్పింది. గోదావరి వరద జలాలను తరలించే ఆ ప్రాజెక్ట్ సెపరేట్ గా చేపడుతున్నందున.. ప్రస్తుత ప్రాజెక్టుకు వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు మార్చాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వ్యాప్కోస్ రిపోర్ట్ తర్వాత గోదావరి బనకచర్ల జలాల మళ్లింపు మార్గంలో ప్రస్తుత ప్రాజెక్టు ఉపయోగపడితే.. దీన్ని వినియోగించుకోవాలా లేదా సమాంతరంగా ఆ పనులు చేపట్టడమో చూడవచ్చనే నిర్ణయానికి వచ్చారు.