భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ బీజేపీ కొత్త టీంను ప్రకటించారు. 40 మందితో కూడిన కొత్త పదాధికారుల కమిటీ ఏర్పాటు చేశారు. 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ట్రెజరర్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శితో జాబితా విడుదల చేశారు. జంబో కమిటీలకు స్వస్తి పలుకుతూ సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. గత కమిటీలో బీజేపీకి 30 మంది అధికార ప్రతినిధులు ఉండగా, ఈ జాబితాను 6కు కుదించారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికే కమిటీలో చోటు లభించింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు తన ప్రకటనలో.. ‘నూతన పదాధికారులకు, వివిధ మోర్చాల నూతన అధ్యక్ష్యులకు శుభాకాంక్షలు. రాజకీయాల్లో ఉత్సాహంతో, శక్తిసామర్ధ్యాలను జోడించి పార్టీ అభివృద్ధికి నిరంతరకృషి, పట్టుదలతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో, రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తారని ఆకాంక్షిస్తూ – మీ సోము వీర్రాజు’ అని పేర్కొన్నారు. ఇక కొత్త టీంలో.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా విష్ణుకుమార్‌రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మి, మాలతీరాణి, నిమ్మల జయరాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల, సురేందర్‌రెడ్డి, చంద్రమౌళి ఉన్నారు. ప్రధాన కార్యదర్శులుగా పీవీఎన్ మాధవ్, విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధుకర్, ఎల్.గాంధీని నియమించారు. అధికార ప్రతినిధులుగా భాను ప్రకాష్‌రెడ్డి, పూడి తిరుపతిరావు, సుహాసిని ఆనంద్, సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎస్.శ్రీనివాస్ ను నియమించారు. ట్రెజరర్ గా సత్యమూర్తి, ఆఫీస్ సెక్రటరీగా పి.శ్రీనివాస్‌ను సోము వీర్రాజు నియమించారు.