
ఇస్రో ఇటీవల చంద్రయాన్-2 మిషన్ ను అర్ధాంతరంగా వాయిదా వేసినప్పటికీ… ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ ట్రాక్ రికార్డు మాత్రం చెక్కు చెదరలేదు. స్పేస్ ఏజన్సీలలో దీని ప్రత్యేకత దీనిదే .. ప్రధానంగా చంద్రయాన్-2 మిషన్ కి వినియోగిస్తున్న జీ ఎస్ ఎల్ వీ-మార్క్-3 రాకెట్ కి వంద శాతం సక్సెస్ రేటు ఉంది. ఈ రాకెట్ ని వరుసగా రెండు ఉపగ్రహ ప్రయోగాల్లో వాడారు. ఆ రెండూ సక్సెస్ అయ్యాయి. అలాగే సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ లో కూడా ఈ రాకెట్ ని వాడినప్పుడు ఎంచక్కా విజయవంతమయ్యింది. ‘ బాహుబలి ‘గా అభివర్ణిస్తున్న ఈ భారీ రాకెట్ తన ఇదివరకటి జీ ఎస్ ఎల్ వీ -2 రాకెట్ కన్నా పూర్తి భిన్నమైంది. ఆ రాకెట్ ను ఇస్రో ముద్దుగా ‘ నాటీ బాయ్ ‘ గా వ్యవహరించేది. అలాగే చిన్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కూడా 46 సార్లు తన సత్తా చాటింది. దాన్ని వాడినప్పుడల్లా ఆ ప్రయోగాలు సక్సెస్ అవుతూ వచ్చాయి. స్పేస్ ఎక్స్ సి ఈ ఓ ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాలు, అదేవిధంగా రష్యన్ సోయుజ్ ఎక్స్ పెరిమెంట్ విఫలమైనప్పుడు కూడా పీ ఎస్ ఎల్ వీ ‘ ప్రయోగాలు ‘ విజయవంతం కావడం విశేషం.
అంతరిక్ష శాస్త్ర విజ్ఞానంలో ఇస్రో ఎంతో అభివృద్ద్ధి చెందిందని, ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుందని ఈ సంస్థ మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ పేర్కొన్నారు. .గతంలో చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని, సాంకేతిక తప్పిదాలను పరిష్కరించుకుని చంద్రయాన్-2 మిషన్ వంటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టడం అభినందనీయమన్నారు. అమెరికా, రష్యా వంటి దేశాల్లోని మీడియా మన చంద్రయాన్-2 మిషన్ ని ఎద్దేవా చేయడం సరికాదన్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా తరువాత మన ఇండియానే ఇలాంటి మిషన్ చేపట్టడం చెప్పుకోదగిన విషయం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఈ మిషన్ ను ప్రయోగించే సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్య నేపథ్యంలో దీన్ని వాయిదా వేయడం మంచిదయిందని, లేని పక్షంలో ఇది పూర్తిగా విఫలమై ఉండేదని కస్తూరి రంగన్ వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా- చంద్రయాన్-2 మిషన్ కు కౌంట్ డౌన్ ను ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి.