10th class girl committed suicide: ప్రేమ వేధింపులు తట్టుకోలేక గుంటూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం కొర్రపాడుకు చెందిన విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ పోకిరి ఆమె వెంట పడుతూ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఆ యువకుడు పెడుతోన్న బాధలు భరించలేక ఆ చిన్నారి చివరికి ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న ఆ విద్యార్థిని చివరి మాటలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చావు, బతుకుల మధ్య ఉన్న ఆ చిన్నారి.. ‘ఆ అబ్బాయి నన్ను ఏడిపించాడు. ఆ బాధ తట్టుకోలేకే ఆత్మ హత్య చేసుకున్నాను. దీనికి మా తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అబ్బాయి వల్లే నేను చనిపోతున్నాను. దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’ అంటూ చెప్పిన మాటలు ఆమె ఎంత మదనపడిందో చెబుతున్నాయి. ఇక విద్యార్థిని మృతదేహాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి సందర్శించి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. విద్యార్థిని మృతికి కారణమైన యువకుడిని వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.