Emergency for Tokyo area: జపాన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. టోక్యో సహా పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ..!

జపాన్ రాజధాని టోక్యో సహా పరిసర ప్రాంతాల్లో మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం

Emergency for Tokyo area: జపాన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. టోక్యో సహా పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ..!
Follow us

|

Updated on: Jan 07, 2021 | 6:21 PM

ఇంతకాలం వణికించిన కరోనా వైరస్‌కు కొత్త రకం స్ట్రెయిన్ తోడవడంతో ప్రపంచదేశాలు మరోసారి భయాందోళనలకు గురవుతున్నాయి. కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అయా దేశాలు మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జపాన్ రాజధాని టోక్యో సహా పరిసర ప్రాంతాల్లో మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. గత కొంత కాలంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో 2,447 కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సూచనల మేరకు జపాన్ ప్రధాని యోషిహిడే ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

కరోనా వ్యాప్తి మరోసారి మొదలవడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయాల్సి వస్తుందని ప్రధాని ప్రకటించారు. ఇందులో భాగంగా రాత్రి 8 గంటల కల్లా రెస్టారెంట్లు, బార్‌లు మూసివేయాలనీ, ప్రజలు ఎక్కడా గుమికూడకుండా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షాపింగ్ మాళ్లు, స్కూళ్లు మాత్రం యధాతథంగా కొనసాగనున్నాయని తెలిపింది. సినిమా హాళ్లు, మ్యూజియంలు సహా ఇతర జన సామూహిక కార్యక్రమాల్లో రద్దీ తక్కువగా ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఎలాంటి జరిమానా విధిస్తారన్నది మాత్రం ప్రకటనలో స్పష్టం చేయలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సంస్థల పేర్లను బహిరంగంగా బయటపెట్టి.. నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న వారికి ప్రోత్సాహం అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. సంవత్సరాంత, నూతన సంవత్సర సెలవుల అనంతరం జపాన్‌లో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సతమతమవుతున్న జపాన్ సర్కార్.. మరోవైపు వైరస్ కట్టడికి అంతే స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని అంత వరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని జపాన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.