ఏపీలో పాత మద్యం పాలసీ? నో ఛేంజ్

Previous Liquor policy continue In AP, ఏపీలో పాత మద్యం పాలసీ? నో ఛేంజ్

రాష్ట్రంలో మద్యనిషేధం అమలుపై   జగన్ సర్కార్ పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉన్న బెల్ట్ షాపులను రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యనిషేధంతో రాష్ట్రానికి రాబడి తగ్గినప్పటికీ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న  మద్యాన్ని ఖచ్చితంగా నిషేధించాలని సీఎం జగన్ నిర్ణయించారు.

మద్య నిషేధం అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం శాఖాపరమైన ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. మరోవైపు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చే లోపు మరో మూడు నెలలపాటు పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా బెల్ట్ షాపులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  అలాగే ప్రస్తుతం ఉన్న వైన్ షాపులను తగ్గించేలా ఆలోచన చేస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4,380 మద్యం షాపులు, 840 బార్లు ఉన్నట్టుగా లెక్కలున్నాయి. వీటిలో దాదాపు 500 షాపులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం జూన్ నెలాఖరుతో ముగియనుంది. అయితే  నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్ ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనసాగించే అవకాశాలున్నట్టుగా  తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *