మరికొద్ది గంటల్లో దుబాయ్‌ వేదికగా ముంబాయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌

|

Sep 28, 2020 | 12:28 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ క్రికెట్‌ అభిమానులకు విందుభోజనం లాంటి మ్యాచ్‌ జరగబోతున్నది.. ముంబాయి ఇండియన్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే పసందైన డిన్నర్‌లాంటిదే కదా!

మరికొద్ది గంటల్లో దుబాయ్‌ వేదికగా ముంబాయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌
Follow us on

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ క్రికెట్‌ అభిమానులకు విందుభోజనం లాంటి మ్యాచ్‌ జరగబోతున్నది.. ముంబాయి ఇండియన్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే పసందైన డిన్నర్‌లాంటిదే కదా! ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి మూడో మ్యాచ్‌ కోసం సంసిద్ధమవుతున్నాయి.. పాయింట్ల పట్టికలో ముందుండాలన్నదే రెండు జట్ల లక్ష్యం.. ఆడిన మొదటి మ్యాచ్‌లో దుమ్మురేపిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ రెండో మ్యాచ్‌లో ఎందుకో తడబాటుకు గురైంది.. ఇందుకు రివర్స్‌గా మొదటి మ్యాచ్‌లో చేతులెత్తేసిన ముంబాయి ఇండియన్స్‌ రెండో మ్యాచ్‌లోనేమో ఊపేసింది.. రెండు జట్లు చెరో గెలుపు సాధించాయన్నమాట! బెంగళూరు టీమ్‌తో పోలిస్తే ముంబాయి కొద్దిగా బలంగా ఉంది.. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ డిపార్ట్‌మెంట్లలో బెంగళూరు కన్నా ఓ రెండు మెట్లు పైనే ఉంది ముంబాయి.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న బెంగళూరు టీమ్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.. అటు బౌలర్లూ మెరుగైన ప్రతిభ కనబర్చలేకపోయారు. ఇటు బ్యాట్స్‌మెన్‌ సరిగ్గా రాణించలేకపోయారు.. దాంతో ఊహించని పరాజయాన్ని ఆ జట్టు చవి చూడాల్సి వచ్చింది.. ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లీ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడనే ఆశతో అభిమానులు ఉన్నారు.. మొదటి మ్యాచ్‌లో కావాల్సినన్ని పరుగులు సాధించిన పడిక్కల్‌ రెండో మ్యాచ్‌లో మాత్రం బ్యాట్‌ను వదిలేశాడు.. ఎంతో గొప్పగా ఊహించుకున్న డివిలయర్స్‌ కూడా అంతే! బౌలింగ్‌ కూడా అలాగే ఉంది.. స్టెయిన్‌ నుంచి ఇంకా నిప్పులు చెరిగే బంతులు రాలేదు.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌ కూడా ఏమంత గొప్పగా లేదు..
ఈసారి బెంగళూరు కొత్తవారికి అవకాశమివ్వాలన్న ఆలోచనతో ఉంది.. ఆల్‌రౌండర్లు క్రిస్‌ మోరిస్‌, మోయిన్‌ అలీలలో ఒకరికి కచ్చితంగా తుది జట్టులో స్థానం లభించవచ్చు. స్టెయిన్‌కు విశ్రాంతినిచ్చి ఆ ప్లేస్‌లో శ్రీలంక బౌలర్‌ ఇసురు ఉదానను తీసుకునే ఛాన్సుంది. అలాగే ఉమేశ్‌ యాదవ్‌ను కూడా తప్పించి హైదరాబాద్‌ మీడియం పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం కల్పించాలనుకుంటోంది బెంగళూరు. స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌లో చాహల్‌ ఓకే! ఆరోన్‌ ఫించ్‌ నుంచి విధ్వంసకరమైన బ్యాటింగ్‌ ఇంకా బాకీ ఉంది.. ముంబాయిపై విజయం సాధించాలంటే కోహ్లీ, డివిలియర్స్‌ ఇద్దరూ రాణించాల్సి ఉంటుంది.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైన ముంబాయి ఆ వెంటనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఓడించింది.. ముంబాయి టీమ్‌లో చెప్పుకోదగ్గర అంశమేమిటంటే ఎవరో ఒకరు బ్యాటింగ్‌ బాధ్యతను భుజనా వేసుకోవడం.. అందరూ రాణిస్తే భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంటుంది.. ఇక డికాక్‌ నుంచి పరుగులు రావాల్సి ఉంది.. ఇక బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, జేమ్స్‌ ప్యాటిన్సన్‌లు ఫామ్‌లో ఉన్నారు.. బుమ్రా ఫామ్‌లోకి వచ్చాడు.. మరోసారి రోహిత్‌శర్మ నుంచి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ను ముంబాయి అభిమానులు కోరుకుంటున్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబాయికున్న ఏకైక ప్రతికూల అంశమేమిటంటే ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం. మరోవైపు బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచి రెండింట్లో ఓడింది. టాస్‌ గెలిచిన జట్టు తొలుత ప్రత్యర్థికి బ్యాటింగ్‌ అప్పగించవచ్చు.. గత నాలుగు మ్యాచ్‌లలో జరిగింది ఇదే! అయితే ఆ నాలుగు మ్యాచుల్లోనూ టాస్‌ గెలిచిన జట్టు ఓడిపోయింది.. ముంబాయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఇప్పటి వరకు పాతిక మ్యాచ్‌లు జరిగాయి.. ఇందులో 16 మ్యాచుల్లో ముంబాయి గెలిచింది. తొమ్మిదింటిలో బెంగళూరు విజయం సాధించింది. ఐపీఎల్‌లో అయిదువేల పరుగులకు రోహిత్‌శర్మ్‌ జస్ట్‌ పది పరుగుల దూరంలో ఉన్నాడు.. అలాగే ఇంకొక్క సిక్సర్‌ను కొడితే ముంబాయి తరఫున 150 సిక్సర్లను సాధించినవాడవుతాడు..

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్, ఆదిత్య తారే, సౌరభ్‌ తివారి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ధవల్‌ కులకర్ణి, జయంత్‌ యాదవ్, సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్‌ పాండ్యా, రాహుల్‌ చహర్, హార్దిక్‌ పాండ్యా, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, మొహసిన్‌ ఖాన్, బల్వంత్‌రాయ్‌ సింగ్, అనుకూల్‌ రాయ్, ఇషాన్‌ కిషన్‌ (భారత ఆటగాళ్లు). క్వింటన్‌ డి కాక్, జేమ్స్‌ ప్యాటిన్సన్, నాథన్‌ కూల్టర్‌ నీల్, ట్రెంట్‌ బౌల్ట్, పొలార్డ్, క్రిస్‌ లిన్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, మెక్లీనగన్‌ (విదేశీ ఆటగాళ్లు).
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మొహమ్మద్‌ సిరాజ్, షహబాజ్‌ అహ్మద్, పార్థివ్‌ పటేల్, యజువేంద్ర చహల్, నవదీప్‌ సైనీ, పవన్‌ నేగి, దేవ్‌దత్‌ పడిక్కల్, శివమ్‌ దూబే, ఉమేశ్‌ యాదవ్, గుర్‌కీరత్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, పవన్‌ దేశ్‌పాండే (భారత ఆటగాళ్లు). క్రిస్‌ మోరిస్, జోష్‌ ఫిలిప్, మొయిన్‌ అలీ, ఆరోన్‌ ఫించ్, ఏబీ డివిలియర్స్, ఇసురు ఉదాన, డేల్‌ స్టెయిన్, ఆడమ్‌ జంపా(విదేశీ ఆటగాళ్లు).