
ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతున్నా.. మన దేశంలో పసిడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక మెటల్ కాదు సెంటిమెంట్. ఆపదకాలంలో ఆదుకునే ఆర్థికభరోసా. సాధారణంగా మహారాష్ట్రలోని జల్గావ్ బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి అని మనకు తెలుసు. కానీ అధికారికంగా ఒక నగరాన్ని భారతదేశ బంగారు రాజధాని అని పిలుస్తారని మీకు తెలుసా..? ఆ నగరం మరేదో కాదు.. కేరళలోని త్రిసూర్.
కేరళలోని త్రిసూర్ నగరం కేవలం ఆధ్యాత్మికతకే కాదు అపరంజి వ్యాపారానికి కూడా నిలయం. దేశంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల టోకు, రిటైల్ కేంద్రంగా త్రిసూర్ వెలుగొందుతోంది. ఈ నగరాన్ని గోల్డ్ క్యాపిటల్ అని పిలవడానికి ప్రధాన కారణాలు ఇవే..
భారీ తయారీ కేంద్రాలు: ఇక్కడ వేలాది ఆభరణాల తయారీ యూనిట్లు, వర్క్‌షాప్‌లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని మెజారిటీ షోరూమ్‌లకు ఇక్కడి నుంచే ఆభరణాలు సరఫరా అవుతాయి.
నైపుణ్యం కలిగిన కళాకారులు: త్రిసూర్‌లో లక్షలాది మంది స్వర్ణకారులు, డిజైనర్లు నివసిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న వారి నైపుణ్యం దేశవిదేశాల్లో గుర్తింపు పొందింది.
దక్షిణ భారతానికి ప్రధాన కేంద్రం: కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక పెద్ద జ్యువెలరీ షోరూమ్‌లు త్రిసూర్ నుంచే తమ స్టాక్‌ను దిగుమతి చేసుకుంటాయి.
త్రిసూర్‌కు బంగారంతో ఉన్న సంబంధం నిన్న మొన్నటిది కాదు. దీనికి దాదాపు ఒక శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఇక్కడి స్వర్ణకారులు విభిన్నమైన ఆభరణాల తయారీని వృత్తిగా స్వీకరించారు. సహకార బ్యాంకులు, చిట్ ఫండ్స్, ఆర్థిక సంస్థల పెరుగుదలతో ఇక్కడ బంగారు వ్యాపారం ఒక వ్యవస్థీకృత పరిశ్రమగా మారింది. కేరళలోని ఆలయాలకు బంగారు ఆభరణాలు సమర్పించే సంప్రదాయం కూడా ఈ నగరం బంగారు కేంద్రంగా మారడానికి ఒక కారణం.
నేడు త్రిసూర్ కేవలం సాంప్రదాయ ఆభరణాలకే పరిమితం కాలేదు. ఆధునిక డిజైన్లు, మెషీన్ కటింగ్ ఆభరణాలు, వివాహ వేడుకలకు ప్రత్యేకంగా చేసే టెంపుల్ జ్యువెలరీ ఇక్కడ ఎంతో ప్రత్యేకం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో ఒకటిగా ఉండటంలో త్రిసూర్ వంటి నగరాల పాత్ర ఎంతో కీలకమైనది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..