
భారతీయ సంస్కృతిలో వైద్యుడికి ఉన్నత స్థానం ఉంది. మనుషుల ప్రాణాలను నిలబెట్టే వైద్యుడుని భగవంతునితో పోలుస్తారు. చిన్న అనారోగ్యమైనా, పెద్ద శస్త్రచికిత్స అయినా.. మనం నమ్మకంగా ఆశ్రయించేది వైద్యులనే. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా తెల్లటి కోట్ ధరించే వైద్యులు.. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లగానే ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తుల్లో కనిపిస్తారు. ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరించడం కేవలం సంప్రదాయమా? లేక దీని వెనుక శాస్త్రీయ కారణమేదైనా ఉందా? ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
శస్త్రచికిత్స సమయంలో సర్జన్లు నిరంతరం మానవ రక్తం ఎరుపు రంగును చూస్తుంటారు. కాంతి వర్ణపటంలో ఎరుపుకు వ్యతిరేకంగా ఉండే రంగులు ఆకుపచ్చ, నీలం. ఈ రంగులు కళ్లకు ఎరుపును మరింత స్పష్టంగా గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో శస్త్రచికిత్స సమయంలో సూక్ష్మమైన మార్పులను కూడా సర్జన్లు సులభంగా గమనించగలుగుతారు.
ప్రకాశవంతమైన వస్తువులు లేదా ఎక్కువసేపు ఎరుపు రంగును చూస్తే కళ్లకు అలసట వస్తుంది. అయితే ఆ వెంటనే ఆకుపచ్చ లేదా నీలం రంగును చూడగానే కళ్లకు సహజంగా ఉపశమనం లభిస్తుంది. ‘టుడేస్ సర్జికల్ నర్స్’ (1998 ఎడిషన్) లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, ఆపరేషన్ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులు కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయని వెల్లడైంది.
వైద్యులు గంటల తరబడి రక్తం, అంతర్గత అవయవాలను చూడాల్సి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఆకుపచ్చ, నీలం రంగులు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ రంగులు వైద్యులలో ఒత్తిడిని తగ్గించి, వారి పూర్తి దృష్టిని శస్త్రచికిత్సపై కేంద్రీకరించడానికి సహాయపడతాయి.
ఆకుపచ్చ రంగుపై రక్తపు మరకలు తెల్లటి దుస్తులపై లాగా తీవ్రంగా కనిపించవు. ఇది కూడా శస్త్రచికిత్స సమయంలో వైద్యుల దృష్టి చెదరకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
1914 వరకు వైద్యులు శస్త్రచికిత్సల సమయంలో కూడా తెల్లటి దుస్తులనే ధరించేవారు. అయితే ఆ ఏడాది ఒక ప్రముఖ వైద్యుడు తొలిసారిగా ఆకుపచ్చ దుస్తులు ధరించి శస్త్రచికిత్స చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ పద్ధతి వేగంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ థియేటర్లలో ఆకుపచ్చ, నీలం రంగులే ప్రమాణంగా మారాయి.
కర్టెన్లు, బెడ్షీట్లు, సిబ్బంది దుస్తులు, మాస్కులు.. చాలా వరకు ఆకుపచ్చ లేదా నీలం రంగులోనే ఉంటాయి. ఎందుకంటే ఈ రంగులు రోగుల కళ్లకు కూడా విశ్రాంతినిస్తాయి, భయాన్ని తగ్గిస్తాయి. సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరించడం వెనుక సంప్రదాయం మాత్రమే కాదు.. కళ్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం వంటి కీలకమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.