మీరు ఇచ్చిన అప్పు సేఫ్‌గా తిరిగి రావాలంటే.. ప్రామిసరీ నోటులో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

డబ్బు అవసరానికి ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు, కేవలం నమ్మకంతో ఇస్తే ఒక్కోసారి అసలుకే ఎసరు రావచ్చు. అందుకే చట్టపరమైన రక్షణ కోసం ప్రామిసరీ నోటు రాసుకోవడం ఉత్తమం. అయితే, చిన్న పొరపాట్లు జరిగినా ఈ నోటు కోర్టులో చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రామిసరీ నోట్‌ రాసుకునే వారు ఈ కింది సూచనలు తప్పక పాటించాలి. ఇవి మీ డబ్బుకు భద్రతనిస్తాయి. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

మీరు ఇచ్చిన అప్పు సేఫ్‌గా తిరిగి రావాలంటే.. ప్రామిసరీ నోటులో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
Promissory Note

Updated on: Apr 20, 2026 | 4:06 PM

ప్రామిసరీ నోటు అనేది అప్పు ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి మధ్య ఉండే ఒక కీలకమైన చట్టపరమైన పత్రం. ఇది కోర్టులో చెల్లుబాటు కావాలంటే దానిపై ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అప్పు ఇచ్చేటప్పుడు రాసుకునే ప్రామిసరీ నోటు (Promissory Note) చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసి ఉండాలి. డబ్బు తిరిగి రాబట్టుకోవడంలో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించడం చాలా ముఖ్యం.

ప్రామిసరీ నోటు చెల్లుబాటు కావాలంటే ఉండాల్సినవి:

రెవెన్యూ స్టాంపు: ప్రామిసరీ నోటుపై నిర్దేశించిన విలువ కలిగిన రెవెన్యూ స్టాంపు ఉండాలి. ఆ స్టాంపుపైనే అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం లేదా వేలిముద్ర వేయాలి. స్టాంపు లేని నోటు చట్టబద్ధంగా చెల్లదు.

ఇవి కూడా చదవండి

స్పష్టమైన వివరాలు: అప్పు తీసుకున్న వ్యక్తి పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా నమోదు చేయాలి. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని అక్షరాలలో, అంకెల్లో స్పష్టంగా రాయాలి. అలాగే వడ్డీ రేటును కూడా ముందే ఖరారు చేసి రాయడం ముఖ్యం.

సాక్షుల సంతకాలు: నోటు రాసేటప్పుడు కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు వారు అక్కడే ఉన్నారని నిరూపించడానికి వారి సంతకాలు, చిరునామాలు అవసరం.

తేదీ, సమయం: నోటుపై తేదీ చాలా కీలకం. ఎందుకంటే ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుండి మూడేళ్ల వరకు మాత్రమే దాని కాలపరిమితి ఉంటుంది.

కాలపరిమితి జాగ్రత్త: మూడేళ్ల గడువు ముగియడానికి ముందే అప్పు తీసుకున్న వ్యక్తి నుండి వడ్డీ లేదా అసలులో కొంత భాగం కట్టించుకుని నోటు వెనుక సంతకం చేయించుకోవాలి. దీనివల్ల నోటు కాలపరిమితి మరో మూడేళ్లు పెరుగుతుంది. లేనిపక్షంలో కోర్టులో దావా వేయడానికి అవకాశం ఉండదు. అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటుతో పాటు వీలైతే చెక్కును కూడా హామీగా తీసుకోవడం అదనపు భద్రతను ఇస్తుంది. చట్టపరమైన నిబంధనలు పాటిస్తే మీ కష్టార్జితం వృథా కాకుండా ఉంటుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us