Cow Humanity: స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే అందరికి తెలుస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనిషి ఆలోచింపజేసేవిగా ఉంటే మరికొన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇంకొన్ని.. మానవత్వం అంటే ఇదేనేమో అనిపిస్తాయి. ఇక ముఖ్యంగా జంతువులు చేసే పనులు.. చూపే తెలివితేటలు వంటి వీడియోలు ఐతే ఓ రేంజ్ లో నెట్టింట్లో హల్ చల్ చేస్తునే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియో ల్లో జాతి వైరం మరచి జంతువులు చూపించే ప్రేమ ఐతే నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో లో ఏముందో తెలుసా.. ఒక ఆవు పంది పిల్లలు కడుపారా పాలు ఇచ్చింది.. మరి ఈ వింత సంఘటన ఎక్కడ జరిగిందో వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశంజిల్లా మార్కాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఆవు పాలను పంది తాగింది. రోడ్డుపక్కన ఆవులు సంచరిస్తుండగా అటుగా వచ్చిన ఓ పంది ఆవు పొదుగును చూసి పాలను తాగింది. సాధారణంగా ఇతర జంతువులకు పాలు ఇచ్చేందుకు ఆవులు అంత సుముఖంగా ఉండవు. అయితే బిడ్డ ఆకలి తల్లికి తెలుసు అన్నట్టుగా ఆ ఆవు తన మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన పందిని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పందికి పట్టింది. పక్కనే తన దూడపెయ్య ఉన్నా పట్టించుకోలేదు.
తన బిడ్డకు పట్టాల్సిన పాలను పంది తాగుతున్నా కనీసం పక్కకు తప్పుకోలేదు. దీంతో కడుపారా ఆవు పాలను తాగిన పంది మనసులోనే ఆవుకు కృతజ్ఞతలు చెప్పుకున్నట్టు కనిపించింది. పంది పాలు తాగిన తర్వాతే ముందుకు కదలడం విశేషం. ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇలా ఆవు పాలిస్తున్న దృశ్యాన్ని స్థానికులు సెల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆవు మాతృత్వాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలా సాయం చేసే గుణాన్ని చూసి మనుషులు కూడా ఇలా లేరు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆవు పంది పాలు తాగుతున్న దృశ్యం చూస్తే .. మానవత్వం మాతృత్వం కలగలిపిన ఆవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం స్టాలిన్.. ప్రజల మధ్యలో సామాన్యుడిలా వాకింగ్