
కైలాష్-మానసరోవర్ యాత్రికులతో సహా పలువురు భారతీయులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హామీ మేరకు, భారత్ తక్షణ స్పందనగా 8 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపి మానవతా దృక్పథాన్ని చాటుకుంది.
బురద, బండరాళ్లతో వేగంగా దూసుకొచ్చిన వరద ఉధృతిలో నేపాల్ కార్మికుడు బిబేక్ కుమాల్ కొట్టుకుపోయాడు. రసువా జిల్లా బిదుర్‌లో బిబేక్ కుమాల్ తన ఇంటి మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతను తవ్వుతున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అతని నలుగురు సహచరులు, గుంత నుంచి వెంటనే బయటకు వచ్చి పరిగెత్తమని కేకలు వేశారు. బిబేక్ గుంత నుంచి బయటకు వచ్చేసరికి, వారు అప్పటికే పారిపోయారు. తను పరిగెత్తడం ప్రారంభించాననీ నీటి ప్రవాహం ఉప్పొంగుతూ వచ్చిందనీ అదృష్టవశాత్తూ మామిడి చెట్టులో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డాననీ తెలిపాడు. మామిడి చెట్టు లేకపోయి ఉంటే తను వరదలో కొట్టుకుపోయి ఉండే వాడిననీ ఇంకా షాక్ నుంచి తేరుకోని బిబేక్ అన్నాడు. కాఠ్మాండూలోని ట్రామా సెంటర్‌లో తన మంచంపై కూర్చుని ఘటనను గుర్తుచేసుకున్నాడు.
సహాయక బృందాలు అతడ్ని రక్షించి ట్రామా సెంటర్ కు తరలించాయి. తన కళ్లెదుటే తను పని చేసిన ఇల్లు కొట్టుకుపోవడం చూసాననీ తెలిపాడు. బండరాయి తగిలి అతని కుడి కాలికి గాయమైంది. ఆసుపత్రి మంచంపై ఉన్నమరో బాలిక 11 ఏళ్ల రిహానా లామిచానే కూడా తృటిలో ప్రాణాలతో బయటపడింది. వరదల కారణంగా స్కూల్ మూతపడటంతో ఇంటికి వెళుతుండగా ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగుతూ వచ్చిందనీ, కింద పడిపోగా ఛాతీకి, కాలికి గాయాలయ్యాయనీ రిహానా తెలిపింది. అయితే తన స్నేహితులకు ఏమైందో తెలియదనీ ఆందోళన వ్యక్తం చేసింది. కూతురిని వెతుక్కుంటూ వెళ్లిన తల్లి రీటా, రిహానాకు ఎలాంటి ప్రమాదం జరగనందుకు సంతోషపడింది.
టిబెట్ లో సంభవించిన భూకంపం కారణంగా నేపాల్‌లోని రసువా, ధాదింగ్ జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. బుధవారం ఉదయం 8:37 గంటలకు టిబెట్‌లో భూకంపం సంభవించిందనీ, మూడు నిమిషాలకే వరదలు ముంచుకొచ్చినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంట్‌కు తెలిపారు. భూకంపం కారణంగా హిమనీనదం బద్దలై వరదలు ముంచుకొచ్చి ఉండవచ్చని చెప్పారు. వరదల ప్రభావంతో భోటే కోషి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.