ఇండియాస్ “బ్లాక్ మ్యాజిక్” క్యాపిటల్ ఏది ? ఆ స్టోరీ ఏంటి ??

బ్లాక్ మ్యాజిక్ లేదా క్షుద్రపూజలు.. ఈ మాట వింటే ముందు ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. అయితే వినడానికే వెన్నులో వణుకు పుట్టించే కథలకు నిలయమైన ఒక ఊరు మన దేశంలోనే ఉందని తెలుసా.. ఇండియాస్ "బ్లాక్ మ్యాజిక్" క్యాపిటల్ అని పిలవబడే ఆ ఊరు ఏంటి ? ఆ కథ ఏంటో తెలుసుకుందాం...

ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఏది ? ఆ స్టోరీ ఏంటి ??
Mayong In Assam

Updated on: Nov 22, 2026 | 3:36 PM

బ్లాక్ మ్యాజిక్ లేదా క్షుద్రపూజలు.. ఈ మాట వింటే ముందు ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. చీకటి గదులు, భయానక మంత్రశక్తులు.. సహా ఎన్నో ఆలోచనలు మనకు మనసులో మెదులుతాయి. ఆధునిక కాలంలో వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసేవారు ఉన్నా.. పూర్వకాలం నుంచి ఈ మంత్రవిద్యల చుట్టూ అల్లుకున్న భయం మాత్రం ఇప్పటికీ చాలామందిని వెంటాడుతూనే ఉంది. మనుషులను వశపరచుకోవడం, వారిని అంతం చేసేందుకు మంత్రాలను ఉపయోగించడం ఇలా ఎన్నో భయాలు వెంటాడతాయి. అయితే వినడానికే వెన్నులో వణుకు పుట్టించే కథలకు నిలయమైన ఒక ఊరు మన దేశంలోనే ఉందని తెలుసా.. ఇండియాస్ “బ్లాక్ మ్యాజిక్” క్యాపిటల్ అని పిలవబడే ఆ ఊరు ఏంటి ? ఆ కథ ఏంటో తెలుసుకుందాం…

ఇండియాస్ “బ్లాక్ మ్యాజిక్” క్యాపిటల్..

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో, గౌహతి నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ మయాంగ్ గ్రామం ఉంది. దీనిని ‘ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్’ (భారతదేశపు చేతబడుల రాజధాని) అని పిలుస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినా.. తరతరాలుగా వస్తున్న స్థానిక నమ్మకాల ప్రకారం ఈ రకంగా పిలుస్తుంటారు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఎంతో ప్రశాంతంగా, పచ్చని ప్రకృతి మధ్య అందంగా కనిపించే ఈ గ్రామం పేరు చెబితేనే ఒకప్పుడు జనం భయంతో వణికిపోయేవారు.

అసలు ఈ గ్రామం కథేంటి..?

‘మాయ’ అంటే భ్రమ లేదా మాయాజాలం అని అర్థం. ఆ పదం నుంచే ఈ గ్రామానికి మయాంగ్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. స్థానిక పురాణాల ప్రకారం, మహాభారతంలోని భీముడి కుమారుడు ఘటోత్కచుడు ఇక్కడి వాడేనని, ఈ ప్రాంతంలోనే ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ గ్రామంలో జరిగినట్లు చెప్పే వింతలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పూర్వకాలంలో ఇక్కడి మాంత్రికులు తమ మంత్రశక్తితో మనుషులను జంతువులుగా మార్చేవారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా చారిత్రక కథనాల ప్రకారం క్రీ.శ. 1337లో మహమ్మద్ షా అనే పాలకుడు దాదాపు లక్ష మంది బలమైన సైన్యంతో అస్సాంపై దండయాత్రకు వచ్చాడు. అయితే మయాంగ్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన ఆ భారీ సైన్యం ఒక్కసారిగా ఆనవాళ్లు లేకుండా మాయమైపోయిందని అంటారు. ఇదంతా ఇక్కడి మాంత్రికుల ప్రయోగాల వల్లే జరిగిందని స్థానికులు చెబుతుంటారు. అందుకే ఆ కాలంలో మొఘల్ చక్రవర్తులు సైతం ఈ గ్రామం వైపు రావడానికి భయపడేవారట.

మంత్రాలతో వైద్యం..

కాగా ఇక్కడ కేవలం క్షుద్రపూజలు మాత్రమే కాకుండా.. ప్రాచీన ఆయుర్వేద మూలికలు, మంత్రాల కలయికతో మొండి రోగాలను కూడా నయం చేసేవారని చెబుతుంటారు. పాము కాటుకు గురైన వారిని కాపాడటం.. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడేవారికి మంత్రాలతో క్షణాల్లో తగ్గించడం వంటివి చేసేవారట. రాగి పళ్లెం వీపుపై అతికించి నొప్పిని లాగే ‘తాంబ్ర పత్ర’ వైద్యం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినదిగా చెబుతున్నారు. అలానే ఈ గ్రామ ప్రాచీన సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ఇక్కడ ‘మయాంగ్ సెంట్రల్ మ్యూజియం’ సైతం ఏర్పాటు చేశారు. ఇందులో పురాతన మంత్ర శాస్త్ర తాళపత్ర గ్రంథాలు, క్షుద్రపూజలకు వాడిన కత్తులు, బలిపీఠాల ఆయుధాలను ఇప్పటికీ భద్రపరిచారు.

అయితే కాలక్రమేణా సైన్స్ అభివృద్ధి చెందడం, ప్రజల్లో అక్షరాస్యత పెరగడంతో మయాంగ్‌లో క్షుద్రపూజల ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంటికో మాంత్రికుడు ఉండేవాడని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని అంటున్నారు. ఒకప్పుడు ఈ ఊర్లోకి అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడేవారని.. కానీ ఇప్పుడు పర్యాటకులకు ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా మారిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us